ఆనందంగా పెళ్లికి రెడీ అయ్యారు..
ఇంతలో పోలీసులు వచ్చారు..
ఆ తర్వాత ఏం జరిగింది..?
దేశవ్యాప్తంగా 'కరోనా వైరస్' లాక్ డౌన్ కొనసాగుతోంది. మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. పోలీసులు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదు. పలు ప్రాంతాల్లో అక్కడికక్కడే వారికి శిక్షలు కూడా విధిస్తున్నారు.
లాక్ డౌన్ పాటిస్తేనే కరోనా మహమ్మారిని సులభంగా అడ్డుకోగలమని రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు చెబుతున్నా.. పోలీసులు చెబుతున్నా.. జనం అక్కడక్కడ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని నవ్సారీలోనూ అదే జరిగింది. పెళ్లిళ్లు, పేరంటాల్లాంటి ఫంక్షన్లు అన్నీ రద్దు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఐతే గుజరాత్‌లోని నవ్సారీలో వివాహ మహోత్సవం నిర్వహించేందుకు కొంత మంది సిద్ధమయ్యారు.
నవ్ సారీలోని ఓ గుడిలో పెళ్లి తంతు నిర్వహించేందుకు ఆనందంగా ఇంటిల్లిపాది, బంధువులు అందరూ వచ్చారు. కానీ స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విషయం పోలీసులకు చేరింది. దీంతో పెళ్లి మండపం వద్దకు వచ్చిన పోలీసులు .. పెళ్లిని ఆపేశారు. మొత్తంగా వధూ, వరులతో సహా 14 మందిపై కేసులు నమోదు చేశారు.
చిఖ్లీ సమీపంలోని వనకల్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని నవ్సారీ ఎస్పీ తెలిపారు. వారందరిపై ప్రస్తుతానికి కేసులు నమోదు చేశామన్నారు. వారిని ముందుగా క్వారంటైన్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం .. కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..