గడిచిన 24 గంటల్లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి దుమారం, వర్షం, పిడుగుల కారణంగా మొత్తం 54 మంది చనిపోయినట్టు సంబంధిత అధికారవర్గాలు మంగళవారం ప్రకటించాయి. దీంతో ఈ నెల రోజుల్లో ఉత్తర ఈశాన్య భారతంలో గాలి దుమారం, పిడుగులకు బలైన వారి సంఖ్య మొత్తం 290కి చేరినట్టు సదరు అధికారవర్గాలు తెలిపాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో 17 మంది, బీహార్‌లో 19 మంది, జార్ఖండ్‌లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ఈ గాలిదుమారం, పిడుగుల బారిన పడి ప్రాణాలొదిలారు. చనిపోయిన వారిలో కొంతమంది నేరుగా పిడుగుపాటుకు గురికాగా ఇంకొంతమంది చెట్లు, భవనాలు మీద కూలడంతో గాయాలపాలై మృతిచెందినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
మే 4న, మే 16న, మే 28న వచ్చిన గాలిదుమారం, పిడుగుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 290కి చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది గాలిదుమారం, పిడుగుపాటు అధికంగా వున్నట్టు ఢిల్లీలోని భారత వాతావరణ కేంద్రం పరిశోధకులు మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. నానాటికి రెట్టింపవుతున్న అధిక ఉష్టోగ్రతలు కూడా అందుకు ఓ కారణం అని మృత్యుంజయ్ మహాపాత్ర అభిప్రాయపడ్డారు.
బీభత్సం: 24 గంటల్లో 54 మంది మృతి !