న్యూఢిల్లీ : మీకు ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా ? అయితే, జాతీయ జనాభా పట్టిక (NPR) నమోదులో భాగంగా ఈ వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వానికి సమర్పించాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. జాతీయ జనాభా పట్టిక నమోదు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ ఓ ప్రకటన చేసింది. హోంమంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మీకు ఆధార్ (Aadhaar), పాస్‌పోర్టు (Passport), డ్రైవింగ్ లైసెన్స్ (Driving licence), ఓటర్ ఐడి (Voter ID card) వంటి డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే.. వాటి వివరాలను జాతీయ జనాభా పట్టిక నమోదులో తప్పనిసరిగా సమర్పించాల్సిందే. ఒకవేళ అవి లేనిపక్షంలోనే.. ఆ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. గతేడాది డిసెంబర్ 24న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుశ్ గోయల్ మాట్లాడుతూ.. ఆధార్ వివరాలు ఇవ్వడం అనేది ఆప్షనల్‌గా ఉంటుందని అన్నారు. కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ఎన్‌పిఆర్ నమోదులో స్వీయ ధృవీకరణ (Self certification or Self-decleration) ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్‌పిఆర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. స్వచ్చందంగా సమాచారం ఇవ్వడం అంటే.. ఒకవేళ ఏవైనా వివరాలు లేనట్టయితే.. అవి ఇవ్వకున్నా పర్వాలేదని తెలిపారు. అయితే, ఎన్‌పీఆర్ నమోదు విషయంలో ముగ్గురు కేంద్ర మంత్రుల ప్రకటనలపై ఒకింత అయోమయం నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారవర్గాలు ఎన్‌పిఆర్ నమోదులో ఆప్షనల్ అనే పదానికి అర్థాన్ని తెలియజేస్తూ ఈ వివరణ ఇచ్చాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మీకు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఉన్నాయా ?