సీబీఎస్ఈ పేపర్ లీక్ కేసు.. ముగ్గురు అరెస్ట్!

సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో జార్ఖండ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు మరో 9 మంది మైనర్లను జువెనైల్ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్రంలోని ఛత్ర జిల్లా ఎస్పీ తెలిపారు.

Last Updated : Mar 31, 2018, 06:21 PM IST
సీబీఎస్ఈ పేపర్ లీక్ కేసు.. ముగ్గురు అరెస్ట్!

సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో జార్ఖండ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు మరో 9 మంది మైనర్లను జువెనైల్ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్రంలోని ఛత్ర జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈ సందర్భంగా ఎస్పీ ఏఎన్ఐకి చెప్పారు. జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురూ స్టడీ విజన్ అనే కోచింగ్ ఇనిస్టిట్యూట్‌కి సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించారు. సీబీఎస్ఈ ప్రశ్నపత్రాలు భద్రపరిచిన బ్యాంకుల వివరాలు, పరీక్షల కేంద్రాలు, ఆయా కేంద్రాలకు సూపరింటెండెంట్‌లుగా వ్యవహరించిన అధికారుల వివరాలని ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులు సీబీఎస్ఈని కోరారు. సీబీఎస్ఈ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఎస్ఈ రీజినల్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి మార్చి 27న 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ లీకేజ్‌పై చేసిన ఫిర్యాదు కాగా మరొకటి ఆ మరుసటి రోజున 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ లీకేజ్‌పై చేసిన ఫిర్యాదు. 

 

ఈ కేసుపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసు జాయింట్ కమిషనర్ (క్రైమ్ విభాగం) పర్యవేక్షణలో ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పడింది. ఈ సిట్ బృందంలో ఇద్దరు పోలీస్ డిప్యూటీ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు సభ్యులుగా వున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు మొత్తం 60 మందిని ప్రశ్నించారు. అందులో 10 వాట్సాప్ గ్రూపులకు సంబంధించిన అడ్మిన్స్ కూడా వున్నారు. ఏ వాట్సాప్ గ్రూపుల్లోనైతే లీకైన సీబీఎస్ఈ ప్రశ్నపత్రాలు షేర్ చేశారో ఆ వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్స్‌ని పోలీసులు ప్రశ్నించారు. 

Trending News