పాఠశాలలో ఔషధాల పంపిణీ అనంతరం చిన్నారి మృతి, ఆస్పత్రిలో చేరిన 160 మంది చిన్నారులు

Last Updated : Aug 10, 2018, 09:27 PM IST
పాఠశాలలో ఔషధాల పంపిణీ అనంతరం చిన్నారి మృతి, ఆస్పత్రిలో చేరిన 160 మంది చిన్నారులు

పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, చిన్నారుల కడుపుల్లో నులిపురుగుల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ జాతీయ పథకం కార్యక్రమం నిర్వహణలో భాగంగా పాఠశాలలో పంచిపెట్టిన ఔషధాలు తీసుకున్న అనంతరం విద్యార్థులు ఆస్పత్రిపాలైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని గోవండి ప్రాంతంలో బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉర్దూ మీడియం పాఠశాలలో గత సోమవారం ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేశారు. అయితే, ఈ ఔషధాలు తీసుకున్న రెండు రోజుల తర్వాత ఓ 12 ఏళ్ల చిన్నారి గురువారం రాత్రి నెత్తుటి వాంతులతో ఆస్పత్రిపాలై మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

సోమవారం మాత్రలు తీసుకున్న చిన్నారి.. బుధవారం, గురువారం కూడా పాఠశాలకి వచ్చినట్టు పాఠశాల సిబ్బంది తెలిపారు. అయితే, మృతి చెందిన చిన్నారికి టీబీ వ్యాధి ఉందనే సంగతి తెలియకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగినట్టుగా అక్కడి అధికారవర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన బీఎంసీ ఎగ్జిక్యూటీవ్ హెల్త్ ఆఫీసర్ పద్మజ కేస్కర్.. విద్యార్థులకు పంపిణీ చేసిన ఔషదాలు పరీక్షించినవేనని తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ చిన్నారి మృతికి అసలు కారణాలు తెలిసే అవకాశం లేదు అని ఈహెచ్ఓ వివరణ ఇచ్చారు.

ఇదిలావుంటే, ఔషధాల పంపిణీ అనంతరం నెత్తుటి వాంతులతో చిన్నారి మృతి చెందిందని తెలుసుకుని భయబ్రాంతులకు గురైన ఇతర చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఆస్పత్రుల ఎదుట బారులుతీరారు. దీంతో ఘట్కోపర్‌లోని రాజావడి ప్రభుత్వ ఆస్పత్రి, గోవండిలోని శతాబ్ధి ఆస్పత్రి చిన్నారులతో కిక్కిరిసిపోయాయి. 160కిపైగా మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరగా అందులో కొంతమంది స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వైద్యులకు తెలిపారు. చిన్నారులని పరీక్షించిన వైద్య నిపుణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News