Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిలో వరదల పరిస్థితి, భద్రాచలం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం, పరివాహక ప్రాంతాల్లో ముంపు పరిస్థితిపై సీఎం కేసీఆర్ సంబంధిత మంత్రులు, ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద నీటి తీవ్రత గురించి కూడా సీఎం కేసీఆర్ ఆరా తీశారు.
భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం కేసీఆర్ కి తెలిపారు. భద్రాచలం వద్ద వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అవసరమైతై, అత్యవసర పరిస్థితుల్లో వెనువెంటనే స్పందించి సహాయం అందించేందుకు సహాయ బృందాలు కూడా సిద్దంగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిఎం కేసీఆర్ కి వివరించారు.
ఇది కూడా చదవండి : Hyderabad Rains: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం.. అవస్థలు పడుతున్న జనం..
రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కూడా భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి, పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
ఇది కూడా చదవండి : Hyderabad Water Board: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు