టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ మరోసారి పోలీస్ పాత్రలో కనువిందు చేయనున్నారు. ఘర్షణ, సూర్య ఐపీఎస్, ఈనాడు లాంటి చిత్రాలలో ఇప్పటికే పోలీస్ పాత్రలలో తనదైన శైలిలో నటించిన వెంకటేష్ మళ్లీ అదే పాత్రలో నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ‘నేను లోకల్’ సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పిన కథ వెంకటేష్‌కి నచ్చిందని.. ఈ చిత్రానికి గనుక వెంకటేష్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తే.. మరోమారు పోలీస్ పాత్రలో ఈ విక్టరీ స్టార్ చెలరేగిపోయే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో వెంకటేష్, అక్కినేని నాగచైతన్యతో కలిసి మరో చిత్రంలో నటించనున్నారు. మొత్తం మీద ఈ సీజనులో వెంకటేష్ పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆయన పోలీస్ పాత్ర పోషించే చిత్రం ఎప్పుడు షూటింగ్ జరుపుకొనే అవకాశం ఉందనేది ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు.
ఈ మధ్యకాలంలో వెంకటేష్ సంవత్సరానికి కేవలం ఒక సినిమా మాత్రమే సైన్ చేస్తున్నారు. 2017లో కూడా ఆయన నటించిన "గురు" చిత్రం ఒక్కటే విడుదలైంది. అలాగే 2016లో కూడా "బాబు బంగారం" చిత్రం ఒక్కటే విడుదలైంది. ఈ మధ్యకాలంలో తేజ దర్శకత్వంలో "ఆటనాదే వేట నాదే" అనే చిత్రానికి కూడా సైన్ చేశారు వెంకటేష్. ఈ చిత్రాన్ని దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
మళ్లీ పోలీస్ పాత్రలో.. విక్టరీ వెంకటేష్