హైదరాబాద్: మా అసోసియేషన్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన పలువురు సభ్యులు చివరకు సమావేశం మధ్యలోంచే నిరసన వ్యక్తంచేస్తూ వెళ్లిపోయారు. సమావేశం నుంచి వాకౌట్ చేసిన పృథ్వీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబర్ పదవి ఇక అవసరం లేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. 400 సినిమాలకు కథలు రాసిన సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని, పరుచూరి కంటతడి పెడుతూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తోంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో.. లేక మా అసోసియేషన్‌లో కొందరి ఆధిపత్య ధోరణి చూసి బాధపడాలో అర్థంకావడం లేదన్నారు.
మా అసోసియేషన్ గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన పృథ్వీరాజ్.. 'మా'లో కొందరి వైఖరి ఎలా ఉందంటే.. వారే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నారని, ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని అసహనం వ్యక్తంచేశారు. సభ్యులు ఎవరేం మాట్లాడినా.. జీవిత రాజశేఖర్ తప్పుపడుతున్నారని మీడియా ఎదుట వాపోయిన పృధ్వీరాజ్.. సినీపరిశ్రమకు చెందిన పెద్దలు జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని, లేదంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికే మా అసోసియేషన్‌ని తరచుగా ఏదో ఓ వివాదం రోడ్డున పడేస్తుండగా తాజాగా పృధ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు అసోసియేషన్‌లో కొందరు పెద్దలను మరింత ఇరుకునపెట్టేవిగా కనిపిస్తున్నాయి అంటున్నారు మా అసోసియేషన్ సభ్యులు.