దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 మే 4న చైనాలో విడుదలై రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రం 2.85 మిలియన్ డాలర్లు (19 కోట్ల రూపాయలు) వసూలు చేసి బాహుబలి మొదటి భాగంగా రికార్డును బీట్ చేసింది. చైనా బాక్సాఫీసు వద్ద ఆల్ టైం డే 1 కలెక్షన్ భారతీయ చలనచిత్రాల జాబితాలో బాహుబలి టాప్ 5 లో చోటు దక్కించుకుంది. అమీర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్'కు తొలిస్థానం, ఇర్ఫాన్ ఖాన్ 'హిందీ మీడియమ్' చిత్రం రెండో స్థానంలో ఉండగా.. బాహుబలి 2 మూడో స్థానంలో నిలిచింది. అమీర్ నటించిన 'దంగల్' నాల్గవ స్థానంలో, సల్మాన్ 'భజరంగీ భాయీజాన్' ఐదవ స్థానంలో ఉన్నాయి.
ఇప్పుడు చైనా బాక్స్ ఆఫీసు బద్దలుకొట్టడానికి తెలుగు చిత్రం రంగస్థలం సిద్ధమవుతోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ముఫ్పై రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండొందల కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పడు ఈ చిత్రాన్ని ఇదే ఏడాది సమ్మర్లో చైనాలో రిలీజ్ చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారని తెలిసింది. అదే జరిగితే చైనాలో మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. రంగస్థలం సూపర్ హిట్టయ్యింది కాబట్టి ఇతర భాషల్లో కూడా డబ్ చేయాలని నిర్ణయించారని తెలిసింది. హిందీ, మలయాళం, తమిళంతో పాటు ఇతర భారతీయ భాషల్లో రంగస్థలం రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో రామ్చరణ్, సమంత కీలక పాత్రలు పోషించారు. 1980ల నాటి వాస్తవ జీవన చిత్రణ, మానవీయ విలువలు కలబోతగా గ్రామీణ జీవన పరిమళాలతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న రంగస్థలం రాం చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. రామ్చరణ్ అద్భుతాభినయం, దర్శకుడు సుకుమార్ సృజనాత్మక ప్రతిభ, హృదయాల్ని స్పృశించే భావోద్వేగాలు..వెరసి ఈ చిత్ర అఖండ విజయానికి బాటలు వేశాయి. ఈ చిత్ర అప్రతిహత జైత్రయాత్ర మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.