'ఇష్టం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత సంతోషం, ఠాగూర్, గౌతమీపుత్ర శాతకర్ణి, మనం లాంటి చిత్రాలలో తన నటన ద్వారా ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నటి శ్రియ. ఈమె గతకొంతకాలంగా ఓ విదేశీ వ్యక్తితో ప్రేమలో ఉన్నారని.. ఆయననే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తల్లి మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం శ్రియ పెళ్లిపై వస్తున్న అలాంటి గాసిప్స్‌లో వాస్తవం లేదని ఆమె తెలిపారు. శ్రియ కూడా తన పెళ్లి గురించి స్పందిస్తూ... అలాంటిదేమైనా ఉంటే మీడియాకే ముందు తెలియజేస్తానని.. అవాస్తవాలను గాసిప్స్ రూపంలో టీవీల్లో ప్రసారం చేయవద్దని కోరారు. ప్రస్తుతం శ్రియ కీలక పాత్రలో నటించిన ‘గాయత్రి’ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అలాగే ఆమె తెలుగులో ‘వీరభోగ వసంత రాయులు’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు.