నవాబ్ మూవీ రివ్యూ

నవాబ్ మూవీ రివ్యూ

Last Updated : Sep 27, 2018, 06:28 PM IST
నవాబ్ మూవీ రివ్యూ

నటీ నటులు : అర‌వింద్ స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు
సంగీతం : ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌
ఎడిటింగ్‌: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
ర‌చ‌న‌: మ‌ణిర‌త్నం, శివ ఆనంది
నిర్మాత‌లు: మ‌ణిర‌త్నం, సుభాష్ క‌ర‌ణ్‌, వ‌ల్ల‌భ‌నేని అశోక్
ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం
నిడివి : 143 నిమిషాలు
విడుదల తేది : 27 సెప్టెంబర్ 2018

‘ఓకే బంగారం’ మినహా గత కొన్నేళ్లుగా సినీ ప్రేమికులను నిరాశ పరుస్తూ వస్తున్న మణిరత్నం ఈసారి ‘నవాబ్’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాకపోతే ఈసారి భారీ స్టార్ కాస్టింగ్‌తో ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈరోజే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘నవాబ్’ సినిమా మణిరత్నం పాత మేజిక్‌ను రిపీట్ చేసిందా ? ఈ సినిమాతో మణిరత్నం ఐయామ్ బ్యాక్ అనిపించుకున్నారా ? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
చెన్నైలో రాజకీయ నాయకులకు బినామిగా ఉంటూ తన పెద్దరికంతో అందరినీ శాసించే భూపతి రాజ్ (ప్రకాష్ రాజ్)కి వరదా(అరవింద్ స్వామి), త్యాగు(అరుణ్ విజయ్), రుద్ర(శింభు) ముగ్గురు కొడుకులు. ఓ సందర్భంలో అనుకోకుండా భూపతి రాజ్ అతని భార్య(జయసుధ)పై ఓ బాంబ్ ఎటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ భూపతి రాజ్ అతని భార్య మెల్లగా కోలుకొని హాస్పిటల్ నుండి ఇంటికొస్తారు. భూపతి రాజ్ పెద్ద కొడుకు వరదా ఇతర దేశాల్లో ఉంటూ వ్యాపారాలు చేసే తన తమ్ముళ్ళు త్యాగు, రుద్రకి జరిగిన సంగతి తెలియజేస్తాడు. విషయం తెలుసుకున్న వాళ్ళిద్దరూ చెన్నైకి తిరిగొస్తారు. తన తండ్రిపై ఎటాక్ చేసింది తమ శత్రువు చిన్నప్ప గౌడ అని భావించిన వరదా ఇద్దరు తమ్ముళ్ళతో అలాగే తన చిన్ననాటి స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ రసూల్(విజయ్ సేతుపతి) సహాయంతో కలిసి చిన్నప్ప మనుషులపై ఎటాక్ చేస్తూనే పెద్దాయన సీటుపై కన్నేస్తాడు. చావుదాక వెళ్లి తిరిగొచ్చిన భూపతి రాజ్‌కి ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన వెంటనే హఠాత్తుగా మరణిస్తాడు. ఇంతకీ భూపతి రాజ్ చనిపోయే ముందు తెలుసుకున్న నిజం ఏంటి ? అతనిపై ఎటాక్ చేసిందెవరు ? భూపతి రాజ్ చనిపోయాక ఏం జరిగింది ? అనేది నవాబ్ కథ.

నటీనటుల పనితీరు :
మణిరత్నం సినిమాలో నటులు కనిపించరు.. స్క్రీన్‌పై పాత్రలే కనిపిస్తాయి. నవాబ్ సినిమాలో చాలా మంది నటీ నటులున్నా… ఏ ఒక్కరూ నటులుగా కనిపించలేదు. అంతలా పాత్రల్లో ఇమిడిపోయారు. వరదా పాత్రలో అరవింద్ స్వామి, రుద్ర పాత్రలో శింభు, రసూల్ పాత్రలో విజయ్ సేతుపతి, త్యాగి పాత్రలో అరుణ్ విజయ్ బెస్ట్ అనిపించుకున్నారు. ఇక జ్యోతిక, అదితి రావు, ఐశ్వర్య రాజేష్, డయానా వారి పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. అదితి రావు గ్లామర్ రోల్‌తో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రకాష్ రాజ్, జయసుధ ఎప్పటి లాగే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు తగినట్టుగా పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
మణిరత్నం సినిమా అంటే సాంకేతికంగా రెండు విషయాల గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. మొదటిది మ్యూజిక్ రెండోది సినిమాటోగ్రఫీ. ఈ రెండు ఎలిమెంట్స్ నవాబ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. ‘నీలి కనుమల్లో’, ’సెగలు చిమ్ముతుంది’, ’భగ భగ’ పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెహ్మాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే సంతోష్ శివన్ తన సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేశాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది అనడంతో అతిశయోక్తి లేదు. ప్రతీ ఫ్రేం చాలా అందంగా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా సినిమాకు కలిసొచ్చింది. మణిరత్నం కథను పర్ఫెక్ట్‌గా ఎడిట్ చేసాడు ఎడిటర్ శ్రీకర్. ఆర్ట్ వర్క్ బాగుంది. కిరణ్ అందించిన మాటలు ఆకట్టుకున్నాయి అలరించాయి. మణిరత్నం డైరెక్షన్- స్క్రీన్ ప్లే అతని అభిమానులను మళ్ళీ మెస్మరైజ్ చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

మణిరత్నం సినిమాలు అప్పుడప్పుడూ బోల్తా కొట్టినా ఆయన అభిమానులు మాత్రం ఆయన ప్రతీ సినిమాకు అదే ఉత్సాహంతో థియేటర్స్‌కి వెళ్తారు. ఈసారి కూడా అదే జరిగింది. సినిమాపై పెద్దగా హైప్ లేకపోయినా మణిరత్నం అనే బ్రాండ్ నవాబ్ సినిమాకి కలిసొచ్చింది. మణిరత్నం గత సినిమాలు కాస్త నిరుత్సాహ పరచడంతో ఈసారి ఆయన నుండి మరో హిట్ సినిమా ఎక్స్పెక్ట్ చేసారు ప్రేక్షకులు.

సినిమా విషయానికొస్తే ప్రారంభం నుండి చివరి వరకూ మణిరత్నం మార్క్ కనిపించింది. ముఖ్యంగా క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను ఎంపిక చేసుకొని వారి నుండి ఉత్తమమైన పర్ఫార్మెన్స్ రాబట్టాడు. సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్టర్స్ ప్రేక్షకుడిని బాగా అలరిస్తాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త బోర్ అనిపించినా బలమైన సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ట్విస్టుతో బ్యాలెన్స్ చేసాడు మణి. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ గతంలో మణిరత్నం సినిమాలను గుర్తుచేసినా ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు ఊహించినట్టు కాకుండా ఊహించని విధంగా డ్రామా నడిపించాడు. ఈసారి రెగ్యులర్ కథకి కొన్ని ట్విస్టులు జోడించి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే – మేకింగ్‌తో మెస్మరైజ్ చేసాడు మణిరత్నం. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ మనసుని హత్తు కుంటాయి. అరవింద్ స్వామి, అదితి రావు హైదరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అలరిస్తాయి.

విషయం పరంగానే కాదు సాంకేతికంగానూ నవాబ్ బెస్ట్ సినిమా అనే ఫీల్ కలిగిస్తుంది. రెహమాన్ మ్యూజిక్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా సాంకేతికంగా వారి వారి డిపార్ట్‌మెంట్‌లో బెస్ట్ అనిపించుకున్న టెక్నిషియన్స్ నవాబ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళారు. సినిమాటోగ్రఫీ, కొన్ని ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్యారెక్టర్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్. ఓవర్ ఆల్‌గా మణిరత్నం స్టైల్‌లో యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘నవాబ్’ సినిమా అందరినీ అలరిస్తుంది.

రేటింగ్ : 3 / 5

జీ సినిమాలు సౌజన్యంతో

Trending News