Minor Boy Killed For Cricket: న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదా కోసం క్రికెట్ ఆట ఆడుకుందాం అని అనుకున్న పిల్లల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలోనే 12 ఏళ్ల బాలుడికి, 13 ఏళ్ల బాలుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో 12 ఏళ్ల బాలుడు తన మాట వినడం లేదని ఆగ్రహించిన మరో బాలుడు.. తన చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని అతడిని బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల బాలుడిని అతడి తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. జూన్ 3వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందాడు.
ఈ మృతికి కారణమైన బాలుడి తల్లిదండ్రులు రాజీకి వచ్చారో ఏమో తెలియదు కానీ.. తమ కొడుకు హత్య ఉదంతంపై మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని పూడ్చిపెట్టి అంత్యక్రియలు పూర్తిచేశారు. అనంతరం ఈ ఘటన బయటికి పొక్కడంతో పోలీసుల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. బాలుడి మృతి ఉదంతంపై సిటీ పోలీసు స్టేషన్కు చెందిన ఒక సీనియర్ అధికారి పిటిఐతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. అనంతరం మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 13 ఏళ్ల బాలుడిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మృతుడి తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలిపారు. బాలుడి శవం పోస్టుమార్టంకు తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకా ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని చెప్పిన పోలీసులు.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 ( హత్యా నేరం ) కింద కేసు నమోదు చేశామని, ఇంకా బాలుడిని అదుపులోకి తీసుకోలేదని కేసు దర్యాప్తు చేస్తోన్న అధికారి తెలిపారు.