Loan Foreclosure Effects on Cibil Score: లోన్ ముందే చెల్లిస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా ?

Loan Foreclosure Effects on Cibil Score: రుణాల చెల్లింపులో ఈఎంఐలు చెల్లిస్తూనే బ్యాంకుల నిబంధనలకు లోబడి లోన్ నిర్ణీత గడువు కంటే ముందే లోన్ చెల్లించే వారు కూడా ఉంటారు. అయితే, తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువు కంటే ముందే చెల్లిస్తే అది మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయేలా చేస్తుందా ? ఇదే సందేహం కొంతమంది బుర్రలను తొలిచేస్తోంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ వార్తా కథనం.

Written by - Pavan | Last Updated : Sep 25, 2023, 10:18 PM IST
Loan Foreclosure Effects on Cibil Score: లోన్ ముందే చెల్లిస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా ?

Loan Foreclosure Effects on Cibil Score: కస్టమర్స్ తమకి ఎదురయ్యే వివిధ రకాల అవసరాలను తీర్చుకోవడం కోసం రుణం తీసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. గృహ నిర్మాణం కోసం హోమ్ లోన్స్, వ్యాపారం కోసం బిజినెస్ లోన్స్, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్స్, వాణిజ్యం, వ్యాపారాభివృద్ధి అవసరాల కోసం బిజినెస్ లోన్స్.. ఇలా అన్ని రకాల అవసరాలకు బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి. అది కూడా గతంలో తరహాలో దరఖాస్తు చేసుకున్నాకా రోజుల తరబడి సమయం తీసుకోకుండా మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్‌లోనే అప్లై చేసుకుని, అక్కడే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే చాలు.. బ్యాంక్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ పూర్తి చేసుకుని లోన్ మంజూరు చేసేస్తున్నారు. 

అయితే, రుణం తీసుకోవడం ఎంత నాణేనికి ఒక వైపు అయితే... ఆ రుణాన్ని తిరిగి చెల్లించడం నాణేనికి రెండో వైపు లాంటిది. తీసుకున్న రుణం తిరిగి సకాలంలో చెల్లించడం అనేది ఎంతో ముఖ్యం. మీ సిబిల్ స్కోర్ పెరగడానికైనా లేదా తగ్గడంలోనైనా ఇదే కీలక పాత్ర పోషిస్తుంది.

రుణాల చెల్లింపులో ఈఎంఐలు చెల్లిస్తూనే బ్యాంకుల నిబంధనలకు లోబడి లోన్ నిర్ణీత గడువు కంటే ముందే లోన్ చెల్లించే వారు కూడా ఉంటారు. అయితే, తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువు కంటే ముందే చెల్లిస్తే అది మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయేలా చేస్తుందా ? ఇదే సందేహం కొంతమంది బుర్రలను తొలిచేస్తోంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ వార్తా కథనం.

లోన్ ఫోర్‌క్లోజర్ అంటే ఏంటి ?
లోన్ ఫోర్‌క్లోజర్ లేదా లోన్ ప్రీ-క్లోజర్ .. ఈ రెండూ ఒక్కటే. రుణం చెల్లించాల్సిన తుది గడువు కంటే ముందే మిగిలి ఉన్న లోన్ మొత్తాన్ని  చెల్లించడాన్నే లోన్ ఫోర్‌క్లోజర్ అని అంటుంటాం. లోన్ ఫోర్‌క్లోజర్ చేయడం వల్ల ఎంతో కొంత వడ్డీ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు రుణ భారం నుండి విముక్తి పొందవచ్చు. కానీ లోన్ ఫోర్‌క్లోజర్ చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏంటి ? అసలు లోన్ ని ముందే కట్టేయడం వల్ల లాభం ఉంటుందా లేక నష్టం ఉంటుందా ? అలాగే సిబిల్ స్కోర్ పై ప్రభావం ఉంటుందా ? ఒకవేళ ఉంటే అది ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం.

లోన్ ఫోర్‌క్లోజర్ మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుందా ?
మీరు తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లించే క్రమంలో పెనాల్టీలు, ప్రీ-క్లోజర్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ లోన్ ఫోర్‌క్లోజర్ అనేది మీ సిబిల్ స్కోర్‌పై దుష్ర్పభావమే చూపిస్తుంది. మరీ ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనుకునే వారు, మొదటిసారిగా రుణం తీసుకున్న వారు తమ రుణాలను ముందుగానే క్లోజ్ చేయకుండా నిర్ణీత తుది గడువు వరకు ఇఎంఐలు చెల్లించడమే మేలు. అలా చేస్తేనే వారి సిబిల్ స్కోర్ పెరుగుతుంది. లేదంటే లోన్ ప్రీక్లోజ్ చేసే వారి క్రెడిట్ స్కోర్ స్వల్పంగా తగ్గే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది అని బ్యాంకింగ్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. 

లోన్ తుది గడువు వరకు ఇఎంఐలు చెల్లిస్తే బ్యాంకులకు వడ్డీల రూపంలో అధిక లబ్ధి చేకూరుతుంది. అందుకే లోన్ ప్రీక్లోజర్ విషయంలో బ్యాంకులు తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది కనుకే పెనాల్టీల రూపంలో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు. లోన్ తీసుకున్న వారి క్రెడిట్ స్కోర్‌పై లోన్ ప్రీక్లోజర్ ప్రభావం చూపడానికి కారణం కూడా అదే. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే లోన్ ఫోర్ క్లోజర్ వల్ల క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది.

Trending News