అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ '' తమ పార్టీ అధికారంలోకి వస్తే, రైతులకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తాం'' అని ప్రకటించారు. సాగు నీరు లేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బోర్లు వేయించుకునేంత ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులకు రూపాయి యాభై పైసలకే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా అందిస్తామని జగన్ తెలిపారు. వైఎస్ఆర్ బీమా ద్వారా రైతులకు రూ.7 లక్షల బీమా అందించడం, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛను, అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే రూ.15 వేలు, రూ.5 లక్షలు ఆదాయం దాటని వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్స వంటి హామీలను జగన్ తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
45 ఏళ్ల వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేల ఆర్థిక సాయం అందించి మహిళల అభ్యున్నతికి పాటుపడేలా చర్యలు తీసుకుంటామని జగన్ సోదరీమణులకు హామీ ఇచ్చారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతో వారికి కూడా వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించుకున్నట్టు జగన్ స్పష్టంచేశారు.