అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఎంవీఎస్ నాగి రెడ్డి, పద్మారావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. గురువారం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే అధికారులతో చంద్రబాబు సమీక్షలు జరుపుతున్నారని, అలాగే విధానపరమైన నిర్ణయాలూ తీసుకుంటున్నారని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. తక్షణమే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఈఓను కోరామని నేతలు మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై పలు విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. ప్రజాధనంతో నిర్మించిన అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాలు పెట్టడం, చట్టాలను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివన్ని నిబంధనలకు విరుద్ధమే అవుతుందని ఆరోపించారు.