రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని ఇటీవల కాలంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తాజాగా గురువారం సైతం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే విషయమై ఆంధ్రా అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి గురించి మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా వ్యాఖ్యానిస్తూ... '' మీరు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రస్తుతానికి అది మీకు తాత్కాలికంగా రాజకీయ లబ్ధిని చేకూర్చవచ్చేమో కానీ శాశ్వతంగా అది దేశానికే చేటు చేస్తుంది '' అని అన్నారు. రాజకీయంగా మనం ఒకరినొకరు విభేదించుకోవచ్చేమో కానీ దేశానికి చేటు చేసే రాజకీయాలు మాత్రం కచ్చితంగా మంచి పరిణామం కాదు అని గుర్తించాల్సిందిగా చంద్రబాబు పేర్కొన్నట్టు ది హన్స్ ఇండియా ప్రచురించిన ఓ కథనం స్పష్టంచేసింది.
ఇదిలావుంటే, కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేసే ప్రయత్నంలో భాగంగా గతంలో వివిధ సందర్భాల్లో నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన హామీలకు సంబంధించిన క్లిప్పింగ్స్ని నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రదర్శన ఇప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే, ఏపీకి అన్యాయం జరగడంలో టీడీపీ తప్పు ఏమీ లేదు అని నిరూపించుకునేందుకే ఏపీ సర్కార్ ఈ విధానాన్ని అవలంభిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.