స్వామి పరిపూర్ణానంద పొలిటికల్ ఎంట్రీకి కారణం ఇదే..

                     

Last Updated : Oct 24, 2018, 07:12 PM IST
స్వామి పరిపూర్ణానంద పొలిటికల్ ఎంట్రీకి కారణం ఇదే..

హైదరాబాద్: ఇటీవలె బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న స్వామి పరిపూర్ణానంద... తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణాలు వివరించారు. కమలం పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, బడుగుల జీవితాలు బాగుపడాలంటే ఆధ్యాత్మిక శక్తితో పాటు రాజకీయ వేదిక కావాలని స్వామి పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు. అందుకే తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

ప్రజల దుస్థితి చూసి చలించిపోయా..

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కేత్ర స్థాయిలో వెళ్లి ప్రజా సమస్యలను చూశానని ..తెలుగు రాష్ట్రాల్లో బస్తీలు, గ్రామాల పరిస్థితులను చూసి తాను తీవ్రంగా చలించానన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పరిస్థితులు మారాలంటే ఆధ్యాత్మిక శక్తితో పాటు రాజకీయ వేదిక కావాలన్నారు. రాజకీయాల్లోకి రావడంపై చాలా ఆలోచించానని.. ఈ విషయంలో తన శ్రేయోభిలాషుల సూచనతోనే రాజకీయాల్లోకి ప్రవేశించానన్నారు. పదవులతో సంబంధం లేకుండా పార్టీ పటిష్ఠత కోసం తన వంతు కృషి చేస్తానని స్వామిజీ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇమడాలంటే గాడ్ ఫాదర్ అవసరమని.. అయితే అలాంటి వారు తనకు ఎవరూ లేరని.. ..తనకు దేవుడే గాడ్ ఫాదర్ అని స్వామి చమత్కరించారు.

 

Trending News