TDP Janasena Coordination Meeting: వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి తెలుగుదేశం, జనసేన సిద్ధమయ్యాయి. రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. ఈ నెల 29వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తమ తొలి ప్రాధాన్యం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాలకీ సమస్యలేనని.. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులుపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన –తెలుగుదేశం కలిసి ప్రచారం చేస్తాయని తెలిపారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి తీర్మానాలు ఇవే..
1.చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ మొదటి తీర్మానం చేశారు. వైసీపీ పాలనలో వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్ష పార్టీల నేతలను నిర్భందాలకు గురి చేస్తున్న అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజా ఉద్యమాలు చేపట్టరాదనే విధంగా నియంత పాలన కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాసమస్యలపై నిలదీస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారనే దురుద్దేశంతో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పలు కేసుల పేరుతో చంద్రబాబుని వీలైనంత ఎక్కువ కాలం జైల్లోనే నిర్బంధించాలనే కుట్ర జరుగుతోంది.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ అరెస్టులు వైసీపీ పాలనలోకి వచ్చిన క్షణం నుంచే మొదలయ్యాయి. సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం.. ఇలా ప్రతి ప్రతిపక్ష పార్టీని వేధించడం ప్రారంభించారు. క్షేత్ర స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరిపైనా అక్రమ కేసులు నమోదు చేయడం, నిర్బంధాలు చేయడం... రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చేస్తున్నారు.
ఇందుకు పరాకాష్ట చంద్రబాబు నాయుడు అరెస్టు. అక్రమంగా, అమానుషంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. అభివృద్ధి అనే మాట విడిచిపెట్టి వైసీపీ పాలకులు సాగిస్తున్న పాలసీ టెర్రరిజం ఇది. ఈ అక్రమ అరెస్టుపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపడుతున్న తెలుగు దేశం, జనసేన పార్టీల నాయకులు, శ్రేణులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని ఈ సమావేశం ఖండిస్తుంది.
2.రాష్ట్రాన్ని అరాచక పాలకుల నుంచి కాపాడుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. టీడీపీ-జనసేన పొత్తుఆవశ్యకతను మనసారా స్వాగతించిన ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను, ప్రజలను అభినందిస్తూ రెండో తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేయటం కొత్తగా తీసుకున్న నిర్ణయంకాదు. 2014 ఎన్నికలప్పుడు కూడా ఇరు పార్టీలు కలిసి పనిచేశాయి. రాష్ట్ర రాజకీయాల్లో స్థిరత్వం కోసం, అనుభవజ్ణైలైన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని భావితరాల భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ సమన్వయంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి.
3.రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన లేదు. చట్టం, నిబంధనలు, ప్రజా క్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేవి కనిపించడం లేదు. పాలసీ టెర్రరిజంతో రాష్ట్రాన్ని వైసీపీ అస్తవ్యస్తం చేసింది. పీపీఏల రద్దు, మద్యం, మైనింగ్, ఇసుకలో దోపిడి, భూకబ్బాలు వంటివాటితో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ గ్రహణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేసే దిశగా తెలుగుదేశం, జనసేన ఐక్యంగా.. అకుంఠిత దీక్షతో ఈ దసరా నుంచి ముందుకు వెళ్తుంది. వైసీపీ పాలనలోని వైఫల్యాలను, చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రతి కుటుంబానికి కొత్త వెలుగులు తీసుకువస్తామని ఉమ్మడిగా హామీ ఇచ్చారు.
Also Read: Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ కొనేవారికి బంపర్ గుడ్ న్యూస్
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.