SSC Paper Leak Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పదవ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరో ఊరట లభించింది. ఈ కేసులో నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో 18 మందికి కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ తో పాటు మాల్ ప్రాక్టీస్ కు సంబంధించి చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసుల విచారణ కొనసాగుతోంది. నారాయణ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయివచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ మంత్రి నారాయణ కూతుళ్లు శరణి, సింధూర, అల్లుడు పునీత్ పాటు నారాయణ విద్యా సంస్థల్లో పని చేస్తున్న మరో 10 మంది సిబ్బంది హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కె.మన్మథరావు.. నారాయణ కుమార్తులు, అల్లుడితో పాటు సిబ్బందికి ఈనెల 18 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.
ఎస్సెస్సీ పేపర్ లీక్ కు సంబంధించి చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదుతో చిత్తూరు వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోనికి తీసుకున్నారు. హైడ్రామా మధ్య చిత్తూరు కోర్టుకు తరలించారు. అయితే విద్యాసంస్థల చైర్మెన్ పదవి నుంచి తాను గతంలోనే తప్పుకున్నానని నారాయణ తరుపు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో నారాయణకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలుకు వెళ్లకుండానే విడుదలయ్యారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. చిత్తూరు పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. నారాయణపై కక్ష పూరితంగా జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.
ఈ కేసులో చిత్తూరు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయవచ్చనే లీకులు వచ్చాయి. దీంతో తమను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావించిన నారాయణ కూతుళ్లు, అల్లుడు హైకోర్టును ఆశ్రయించారు. తమకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. నారాయణ విద్యాసంస్థల డిప్యూటీ మేనేజర్ కొండలరావుతో పాటు మరో తొమ్మిది మంది కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ తో తమ క్లైయింట్స్ కు సంబంధం లేదని ఆయన వాదించారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు నిందితులకు జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు విచారణకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు కొంత సమయం కావాలని పోలీసుల తరపు లాయర్ వాదించారు. పిటిషనర్లు నిందితులు కానప్పుడు.. బెయిల్ ఇవ్వాల్సిన అవరసం లేదని కూడా చెప్పారు. అయితే పిటిషనర్లు నిందితులు కానప్పుడు.. వాళ్లకు రక్షణ కల్పిస్తే తప్పేంటని ప్రశ్నించిన న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు.. నారాయణ కుటుంబ సభ్యులతో పాటు మరో 10 మంది సిబ్బందికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
READ ALSO: Bandi Sanjay on PJR: తెలంగాణ బీజేపీ టార్గెట్ కాంగ్రెసేనా? పీవీ, పీజేఆర్ జపం అందుకేనా?
READ ALSO: MLA Jagga Reddy Dance: ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీన్మార్ స్టెప్పులు.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.