PK TEAM REPORT : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా సాగుతోంది. అధికార , విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. పొత్తుల రాజకీయం ఏపీలో రంజుగా సాగుతోంది. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీ వర్గాలు మాత్రం తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లడంతో పాటు పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. పార్టీ అభ్యర్థుల ఎంపికపైనా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి పీకే టీమ్ వర్క్ చేసింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లే జగన్ కు అఖండ విజయం సాధ్యమైందనే వాదన ఉంది. ప్రస్తుతం కూడా పీకే టీమ్ జగన్ కోసం పని చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ నేరుగా పని చేయకపోయినా ఆయన టీమ్.. వైసీపీ కోసం ఏపీలో విస్తృతంగా సర్వేలు చేస్తోంది.ప్రశాంత్ కిశోర్ టీమ్ లో కీలకంగా ఉన్న రిషిరాజ్ నేతృత్వంలో ఏపీలో వైసీపీ కోసం పీకే టీమ్ పని చేస్తోంది.
ఇటీవల పార్టీపై ఫోకస్ చేసిన సీఎం జగన్.. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెబుతూ వస్తున్నారు. ఈ నేుథ్యంలోనే పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పని తీరుపై తాజాగా పీకే టీమ్ నుంచి సీఎం జగన్ నివేదిక కోరారట. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసిన రిషిరాజ్ టీమ్ ఇటీవలే జగన్ కు నివేదిక ఇచ్చిందట. ఆ రిపోర్టు చూసి సీఎం జగన్ షాక్ అయ్యారని తెలుస్తోంది. తమ సర్వేలో వచ్చింది వచ్చినట్లు జగన్ కు రిపోర్ట్ ఇచ్చారట రిషిరాజ్. వచ్చే రెండేళ్లలో అభివృద్ధిపై ఫోకస్ చేయకపోతే పార్టీకి చాలా నష్టమని తేల్చి చెప్పారట. సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని.. అభివృద్దిని ప్రజలు కోరుకుంటున్నారని తన నివేదికలో వెల్లడించారట. అభివృద్ధిపై ఫోకస్ చేయకపోతే వైసీపీకి లైఫ్ ఉండదని సూటిగానే చెప్పేసిందట రిషిరాజ్ టీమ్. ఉద్యోగులు, యువతతో పాటు తటస్టులు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారని సీఎం జగన్ కు పీకే టీమ్ నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది.
జగన్ సర్కార్ ఏర్పడ్డాకా ఫోకసంతా సంక్షేమ పథకాలపైనే పెట్టారు. ప్రతి నెలా ఏదో ఒక పథకంలో భాగంగా బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు సీఎం జగన్. లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసమే భారీగా అప్పులు చేస్తోంది జగన్ సర్కార్. మరోవైపు నిధుల లేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరగడం లేదు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రోడ్ల దుస్టితికి సంబంధించి సోషల్ మీడియాలో లక్షలాది పోస్టులు వస్తున్నాయి. రోడ్లు బాగు చేసేందుకు కూడా జగన్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే ఆరోపణలు ఉన్నాయి. పెట్టుబడులు లేక పారిశ్రామిక రంగం కుదేలైందని.. వేలాది మంది యువకులు రోడ్డున పడ్డారని టీడీపీ, బీజేపీ,జనసనే పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ సర్కార్ నిరుద్యోగులను నట్టేట ముంచిందనే ఆరోపణలు వస్తున్నాయి. సీపీఎస్ రద్దు విషయంలో జగన్ మాట తప్పారని ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపారనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వానికి సంబంధించి ప్రజల అభిప్రాయాలతో పాటు ప్రధాన సమస్యలను తన నివేదికలో పొందు పరిచిందట రిషిరాజ్ టీమ్. వచ్చే రెండేళ్లలో అభివృద్ధిపై ఫోకస్ చేయకపోతే పార్టీకి నష్టమని తేల్చిచెప్పారట. అయితే పీకే టీమ్ ఇచ్చిన నివేదికపై వైసీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. సర్వేలో తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారని తెలుస్తోంది.
Also read: హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. రెండు రోజులుగా ఓయో రూంలో..!
Also read: Telangana Governer: కేసీఆర్ పై సమరమే.. తెలంగాణ గవర్నర్ మరో సంచలనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook