భీమవరంలో కనీసం డంపింగ్ యార్డు లేదు.. ఆ ఘనత బీజేపీ ఎంపీ గోకరాజు గారిదే - పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పట్టణంలోని పోలీస్ బొమ్మ దగ్గర జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుపై విమర్శలు చేశారు.

Last Updated : Jul 28, 2018, 08:57 PM IST
భీమవరంలో కనీసం డంపింగ్ యార్డు లేదు.. ఆ ఘనత బీజేపీ ఎంపీ గోకరాజు గారిదే - పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పట్టణంలోని పోలీస్ బొమ్మ దగ్గర జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుపై విమర్శలు చేశారు. "ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగిన భీమవరంలో కనీసం డంపింగ్ యార్డు కూడా లేదు. ఆ ప్రాంతం నుండి గెలిచిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు గారు కనీసం తన ప్రాంతంలో డంపింగ్ యార్డు కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. నేను గత ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేశాను. ఆ తర్వాత భీమవరం సమస్యల గురించి ఆయనకు ఫోన్ చేస్తే.. కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. ఆయన ఏరు దాటాక తెప్ప తగలేశారు. అసలు పశ్చిమ గోదావరికి ఏం కావాలో.. భీమవరానికి ఏం కావాలో ఇదే సెంటర్‌లో చర్చిద్దాం.

సీఎం గారి అబ్బాయి నారా లోకేష్ గారిని.. ప్రతిపక్ష నేత జగన్ గారిని.. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు గార్లను కూడా ఆ చర్చా కార్యక్రమానికి ఆహ్వానిద్దాం" అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడి అసెంబ్లీకి వెళ్లమంటే.. ప్రతిపక్ష నేత జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. భీమవరంలో డంపింగ్ యార్డు పెట్టించి ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.

ఒకసారి తన ఫ్లెక్సీని భీమవరంలో చించేస్తే 144 సెక్షన్ పెట్టారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. "యల్లాప్రగడ సుబ్బారావు, దంతులూరి నారాయణరాజు, అడివి బాపిరాజు, తిరుపతి వెంకటకవులు నడయాడిన ప్రాంతంలో ఫ్లెక్సీ కోసం 144 సెక్షన్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. కుర్రాళ్లు గొడవలు చేస్తే సర్ది చెప్పాలి.. సముదాయించాలి. దంతులూరి కుటుంబీకులో, గన్నాబత్తుల కుటుంబీకులో ఉంటే ఆ బాధ్యత తీసుకొనేవారు. ఆ మహనీయులు అందించిన స్ఫూర్తితోనే ఈ తరం ముందుకు వెళ్లాలి.

విద్యలకు నిలయం ఈ ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో అనేకమంది తాగునీటి సమస్యలతో బాధపడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఎమ్మెల్యే అంజిబాబు అనుచరులు తాగునీటి ప్రాజెక్టు కోసం 60 ఎకరాలు సేకరిస్తామని చెప్పి.. ఎకరాను 12 లక్షల రూపాయలకు తీసుకున్నారు. ఆ ప్రాజెక్టు రానేలేదు. ఇప్పుడు భూములు తిరిగివ్వమంటే ఎకరా.. కోటి రూపాయలు చెబుతున్నారు. ఇదేమి దోపిడి.." అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 

Trending News