తెలుగు నేలపై మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన శాశ్వత సచివాలయం ప్రపంచంలోనే అంత్యంత ఎత్తైన సచివాలయంగా రూపుదిద్దుకోనుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా సింగపూర్ అధికారులు దీన్ని రెడీ చేశారు. మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలో 212 మీటర్లు ఎత్తైన భవనాలను నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. చరిత్ర సృష్టించనున్న భవనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అత్యున్నత స్థాయిలో కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మౌలిక సదుపాయాలు కల్పన పనిలో అధికారులు బీజీ బీజీగా గడుపుతున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మన రాజధాని అమరావతి సాంకేతికత, నవకల్పనలు, విభిన్న సంస్కృతుల మేలు కలయిక అని అభివర్ణించారు. రాజధాని అమరావతిని అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా..మౌలిక సదుపాయాల కేంద్రంగా, సాధారణ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను సైతం ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీ పరిపాలన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతితక్కువ సమయంలోనే భవనాలు నిర్మించి ఏపీ సర్కార్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని స్పూర్తిగా తీసుకొని శాశ్వత సచివాలయం కూడా అదే స్పీడ్ తో నిర్మించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది.