Nara Lokesh slams AP CM YS Jagan at torch rally in Amaravati : అమరావతిలో కాగడాల ప్రదర్శనతో భారీ ర్యాలీ.. సీఎం జగన్‌కి నారా లోకేష్ సవాల్!

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారా అనే సందేహాల నేపథ్యంలో ఇప్పటికే రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన రైతులు ఆందోళనలు చేపట్టి రోడ్డెక్కగా.. వారితో మొదటి నుంచి గొంతు కలుపుతూ వస్తోన్న టీడీపీ మంగళవారం రాత్రి అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది.

Last Updated : Dec 25, 2019, 12:50 AM IST
Nara Lokesh slams AP CM YS Jagan at torch rally in Amaravati : అమరావతిలో కాగడాల ప్రదర్శనతో భారీ ర్యాలీ.. సీఎం జగన్‌కి నారా లోకేష్ సవాల్!

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారా అనే సందేహాల నేపథ్యంలో ఇప్పటికే రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన రైతులు ఆందోళనలు చేపట్టి రోడ్డెక్కగా.. వారితో మొదటి నుంచి గొంతు కలుపుతూ వస్తోన్న టీడీపీ మంగళవారం రాత్రి అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది. మంగళవారం రాత్రి అమరావతి ప్రాంతీయులు, రైతులు, రైతు కూలీల ఆధ్వర్యంలో ఎంఎస్ఎస్ భవన్ నుంచి ప్రారంభమైన కాగడాల ర్యాలీలో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. పాత బస్టాండ్ సెంటర్ నుంచి చినపంజా వీధి మీదుగా మెయిన్ బజార్ దేవస్థానం రోడ్డు అంబేద్కర్ సెంటర్ వరకూ కొనసాగిన ర్యాలీలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు, డౌన్ డౌన్ సీఎం అనే ప్లకార్డులను ప్రదర్శించిన  నిరసనకారులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు. 

విశాఖలో ఇన్‌సైడ్ ట్రేడింగ్..
ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో తప్పుడు హామీలిచ్చి.. అవి నెరవేర్చలేక.. అసలు పాలనే చేతకాక ప్రతీ హామీపై మాట తప్పుతున్న సీఎం జగన్, చివరికి అమరావతి రాజధానిపైనా మడమ తిప్పారని లోకేశ్ ఆరోపించారు. తన పార్టీ మేనిఫెస్టోలో కూడా రాజధానిగా అమరావతి ఉంటుందని పేర్కొన్న జగన్, ప్రతిపక్ష నేతగా కూడా అమరావతి రాజధానికి జై కొట్టి నేడు మాట మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని బలపర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు విశాఖకు ఎందుకు పారిపోతున్నావంటూ ప్రశ్నించారు. అక్కడ మీరు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు దమ్ముంటే న్యాయవిచారణకు ఆదేశించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 రాజధాని ప్రాంతీయులు, రైతులు, రైతు కూలీల కాగడాల ప్రదర్శనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

అమరావతిపై కుట్రలను టీడీపీ వ్యతిరేకిస్తోంది..
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. తానే స్వయంగా చేసిన ఆరోపణలపై ఎందుకు విచారణకు ఆదేశించలేకపోతున్నారని నారా లోకేష్ నిలదీశారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం విభజించు.. పాలించు సూత్రంతో సీఎం జగన్ ఇటువంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తుందని, వేలాది మంది రైతుల త్యాగాలతో రూపుదిద్దుకున్న అమరావతిని పాలనా వికేంద్రీకరణ పేరుతోని తరలించే కుట్రలను వ్యతిరేకిస్తోందని నారా లోకేష్ స్పష్టంచేశారు. 

సీఎం జగన్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు..
వైఎస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టనని అన్నారని... కానీ అదే జగన్ ఇప్పుడు ప్రాంతాల మధ్యే విద్వేషాలు పెంచే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇవాళ అమరావతికి జరిగే అన్యాయం రేపు అన్ని జిల్లాలకు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడపాలనే జగన్ ఎత్తుగడని ప్రజలు గమనిస్తున్నారని... పెట్టుబడులన్నీ తరలిపోతున్నా పాలకుల్లో కనీస స్పందనే కరువైందని లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓవైపు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, కూలీలు ఆందోళనలు చేస్తోంటే.. పాలకులు వారిని అవహేళన చేస్తుండటం, రైతులు గోడు వినేందుకు రాకపోవడం వంటివి వైసిపి నేతల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 

Trending News