వణికిస్తున్న గజ తుఫాన్.. జాలర్లకు హెచ్చరికలు జారీ

వణికిస్తున్న గజ తుఫాన్.. జాలర్లకు హెచ్చరికలు జారీ

Last Updated : Nov 11, 2018, 11:44 PM IST
వణికిస్తున్న గజ తుఫాన్.. జాలర్లకు హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారి ఆంధ్రా, తమిళనాడు తీరం ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఆదివారం ఉదయం 8:30 గంటలకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటకు 980 కిమీ, చెన్నైకి ఈశాన్యంలో 930 కిమీ, అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కి పశ్చిమాన 460 కిమీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) పేర్కొంది. నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు గజ తుపాను ప్రభావం ఉంటుందని ఆర్టీజీఎస్ తాజాగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. 

దక్షిణ చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో వేగంగా కదులుతున్న తుఫాను ప్రభావం కారణంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు ఈ ప్రకటనలో స్పష్టంచేశారు. ఈనెల 15న తమిళనాడులో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ స్పష్టంచేసింది. 

గజ తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అలాగే తీర ప్రాంత వాసులు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీరాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Trending News