దాచేపల్లి నిందితుడు ఆత్మహత్య..!

దాచేపల్లి అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Last Updated : May 4, 2018, 05:13 PM IST
దాచేపల్లి నిందితుడు ఆత్మహత్య..!

దాచేపల్లి అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. రెండ్రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. గురజాల మండలం తేలికుట్ల- దైద సమీపంలోని పొలాల్లో సుబ్బయ్య చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పోలీసుల యంత్రాంగం అక్కడికి వెళ్లింది. మరికాసేపట్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ఘటనను తెదేపా, వైకాపా, జనసేన పార్టీలతో సహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి.

ఇదిలా ఉండగా.. నేడు వైకాపా ఎమ్మెల్యే రోజా బాధితురాలిని పరామర్శించారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అరెస్టు చేశారు. దాచేపల్లిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్‌ చేశారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని ఆమె విమర్శించారు.

డిప్యూటి సీఎం, హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ కూడా బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని రోజాను ఉద్దేశిస్తూ అన్నారు.  రోజాను పార్ట్ టైం ఎమ్మెల్యేగా అభివర్ణించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించామని అన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్నారు.

కాగా.. నిందితుడు కృష్ణా నది దాటి తెలంగాణ వైపు వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. నిందితుడు తాను చనిపోతున్నట్లు బంధువులకు బుధవారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ కాల్‌ను ట్రేస్ చేయగా తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్‌ను చూపించింది. దీంతో సుబ్బయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నదితీర ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Trending News