CM Jagan Comments On Chandrababu Naidu: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. దాదాపు 8 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లా నార్పలలో రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నిధులు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేశారు. ఈ పథకం కింద మొత్తం రూ.4,275.76 కోట్ల నగదు ప్రభుత్వం అందజేసింది. గత నాలుగేళ్లలో విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదని.. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు అందిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం జగన్. నేషనల్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. పంచతంత్రం కథ చెబుతూ.. చంద్రబాబును పులితో పోల్చారు. నరమాసం తినే పులి ముసలిదైపోయిందని.. ఆ పులి నడవలేక, పరిగెత్తలేక పోతుందన్నారు. నాలుగు తోడెళ్లలాంటి నక్కలను వెంట వేసుకుని తిరుగుతోందంటూ సెటైర్లు వేశారు. వేటాడే శక్తి కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉందన్నారు. ఈ పులిని నమ్మితే.. తినేస్తుందని ఎవరూ నమ్మకుండా పోయారని అన్నారు.
ఆ పులి మాత్రం ఇంకా గొప్పలు చెపుకుంటోందన్నారు. ఎటు తిరగలేని ఆ పులి.. మనుషులను ఎలా తినాలనే ప్లాన్ వేసుకుందన్నారు. తాను సీనియర్‌ను ఇప్పుడు మంచోడ్ని అయ్యానంటూ నమ్మించే ప్రయత్నం చేస్తారని.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు అని.. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు. మాయ మాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదని సూచించారు. చంద్రబాబుకు తోడుగా ఓ గజ దొంగల ముఠా ఉందంటూ కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు తనకు కావాలని కోరారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపించారు. సాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో మూడు నెలల్లో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు.. వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook