Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర.. జగన్ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు

Bandi Sanjay Fires on AP Govt: సీఎం జగన్‌ సర్కారుపై బండి సంజయ్ ఓ రేంజ్‌లో విచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమేనని అన్నారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 21, 2023, 05:09 PM IST
Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర.. జగన్ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు

Bandi Sanjay Fires on AP Govt: "ఎవరైనా అభివృద్ధిలో, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో పోటీ పడతారు. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఒకటి.. రెండు.. మూడు అని పోటీ పడ్డట్లుగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయి" అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్న సర్కార్ ప్రపంచంలోనే లేదని.. ఏపీ సర్కార్‌కే ఆ ఖ్యాతి దక్కుతుందని ఎద్దేవా చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని.. కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘‘ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్‌గా బండి సంజయ్ ప్రసంగించారు.  

పురంధరేశ్వరి నాయకత్వంలో ఏపీలో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్నారు. ఏపీలోలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. ఈసారి వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొందని.. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందని.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉందన్నారు. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారని.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

"ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలకు అంతో ఇంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే మోదీ ప్రభుత్వ సహకారం వల్లే. కేంద్రం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి జరుగుతోంది. కేంద్రమే స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు కట్టించింది. పేదలకు మంజూరైన లక్షలాది ఇండ్లకు నిధులు మంజూరు చేస్తోంది. జాతీయ రహదారులను నిర్మిస్తోంది కేంద్రమే. గ్రామీణ సడక్ యోజన నిధులు కేంద్రానివే. స్మార్ట్ సిటీ నిధులు కేంద్రానివే. కానీ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వాటి పేర్లను మార్చి, ఫోటోలు మార్చి వాళ్ల పథకాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. 

ఏపీలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేస్తే.. జగన్ ప్రభుత్వం అంతకు రెట్టింపు అంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. వడ్డీ రూపంలోనే ఏటా రూ.50 వేల కోట్లు చెల్లిస్తున్నారు. అయినా జీతాలిచ్చే పరిస్థితుల్లో లేరు. పారిశుధ్య కార్మికులకు వేతనాలివ్వడం లేదు. అవినీతిలో, అప్పుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నరు. నేను రూ.5 లక్షల కోట్ల అప్పు చేశానని కేసీఆర్ చెబుతుంటే.. మేం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశానని ఏపీ సీఎం చెబుతున్నారు. కార్పొరేట్ కాలేజీలో ర్యాంకుల కోసం పోటీ పడుతుంటే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవినీతి, అప్పుల్లో మేమే నెంబర్ వన్ అంటూ పోటీ పడుతున్నయ్.

మద్యం దరఖాస్తుల ద్వారానే 2500 కోట్లకుపైగా సంపాదించానని కేసీఆర్ చెబుతుంటే.. ఏకంగా మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గతంలో ఇదే వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. అందుకు భిన్నంగా మద్యం బాండ్లతో అప్పు చేసుకునే దుస్థితి. అంతేగాకుండా గంజాయి స్మగ్లర్ల కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారింది. దేశంలో అత్యధిక గంజాయి స్మగ్లర్లు ఏపీలోనే ఉన్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ ఆదాయం లక్షా 30 వేల కోట్లు అయితే.. అందులో 40 వేల కోట్లు కేంద్రమే ఇస్తోంది.." అని బండి సంజయ్ అన్నారు. 

ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని.. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారని అన్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా..? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నాడంటే.. మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమోనని అన్నారు.
 

Trending News