‘ఏపీకి కేంద్రం సహకారం’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ‘ఏపీకి కేంద్రం సహకారం’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.

Last Updated : Apr 15, 2018, 05:30 PM IST
‘ఏపీకి కేంద్రం సహకారం’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన బీజేపీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ‘ఏపీకి కేంద్రం సహకారం’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. విజయవాడలో బీజేపీ నాయకుల సమక్షంలో ఆయన ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. కేంద్రంపై కొందరు తెలిసీతెలియని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే బుక్‌లెట్‌ విడుదల చేశామన్నారు. శాసనసభలో కేంద్రంపై చేసిన ఆరోపణలకు బుక్‌లెట్‌లో సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసమే ప్రత్యేక హోదా ఇస్తామన్నామని, అయితే హోదా సాధ్యం కాని పక్షంలో.. ప్రత్యేక నిధులు మంజూరుకు కేంద్రం అంగీకరించిందన్నారు.

ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అభినందించిందని హరిబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతో ఐదేళ్లలో రూ.15వేల కోట్ల వరకు లబ్ది చేకూరేదని, ప్యాకేజీ రూపంలోఅంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ప్యాకేజీ ప్రకటించినప్పుడు కేంద్రాన్ని అభినందించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి అన్యాయం చేశారని మాట్లాడటం బాధించిందన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆరోపణలు నిరాధారం, అసత్యమన్నారు. సీఎం సింగపూర్‌లో ప్రధాని మోదీని నిందించటం అభ్యంతరకరమన్నారు. గతంలో ఏ పార్టీ నాయకుడు విదేశీ గడ్డపై ప్రధానిని నిందించలేదన్నారు. ప్రధాని దీక్షను తప్పుబట్టిన సీఎం చంద్రబాబు 20న దీక్ష ఎలా చేస్తారో చెప్పాలన్నారు.

సర్వశిక్షా అభియాన్ (ఎస్.ఎస్.ఎ) నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ పార్టీ ఆరోపించింది. కాగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిబంధనలకు విరుద్దంగా ఎస్.ఎస్.ఎతో సంబంధం లేని శాఖలకు రు.22.87 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చేశారని, మొత్తం అడ్వాన్సులుగా ఇచ్చిన రు.123.47 కోట్లకు వినియోగ పత్రాలు (యు.సి) సమర్పించలేదని, యు.సి.లు అందించనందున కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యమవుతోందని బీజేపీ పేర్కొంది.

 

Trending News