Memantha Siddam: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సు యాత్ర నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు ఒకేసారి కలిసి వచ్చారని అభివర్ణించారు. వారు కలిసి తీసుకొస్తామని చెబుతున్న నారా వారి పాలనను అడ్డుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. చంద్రబాబును జిత్తులమారి.. పొత్తులమారిగా పేర్కొన్నారు. తన సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. కూటమిని తోడేళ్లుగా పేర్కొన్నారు.
Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్
'పేదలను మళ్లీ చీకట్లోకి నెట్టేందుకు ప్రత్యర్థులు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కుట్రలను తిప్పికొట్టేడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలవాలి. ఈ ఎన్నికలు మనకు జైత్రయాత్ర' అని జగన్ తెలిపారు. కూటమికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని.. ఫ్యాన్‌కు ఓటు వేస్తే ఐదేళ్లు ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని ప్రకటించారు. కానీ గత ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుందని చెప్పారు. బషీరాబాగ్‌లో కాల్పులు మరచిపోలేమని గుర్తు చేశారు. మళ్లీ మరోసారి మోసం చేసేందుకు బాబు అండ్ కో వస్తోందని, కొత్త రంగులు.. కొత్త మోసాలతో బాబు మేనిఫెస్టో ఉందని విమర్శించారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని ప్రత్యర్థులకు హితవు పలికారు.
Also Read: BJP List: బీజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. సీనియర్లకు షాక్.. ఫిరాయింపుదారులకు ఛాన్స్
ప్రతి ఇంటికి 58 నెలల్లో సంక్షేమం అందించినట్లు జగన్ తెలిపారు. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లు కూడా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. సంక్షేమ పాలనతో పేదల గుండెల్లో తనకు చోటు దక్కిందని.. అదే తనకు బహుమతి అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమాన్ని చేరువ చేశామని, ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. నారా వారి పాలన రాకుండా అడ్డుకునేందుకు ప్రజలంతా 'సిద్ధం'గా ఉన్నారని జగన్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook