చంద్రబాబు ఇల్లు మునుగుతుందని అప్పుడే చెప్పాం: మంత్రి అనిల్ కుమార్

చంద్రబాబు ఇల్లు మునుగుతుందని అప్పుడే చెప్పాం: మంత్రి అనిల్ కుమార్

Last Updated : Aug 16, 2019, 08:15 PM IST
చంద్రబాబు ఇల్లు మునుగుతుందని అప్పుడే చెప్పాం: మంత్రి అనిల్ కుమార్

అమరావతి: ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం చుట్టే తిరుగుతున్నాయి. హై సెక్యురిటీ జోన్‌లో వున్న తన నివాసంపై డ్రోన్‌ని ఎలా ప్రయోగిస్తారని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టగా.. తమ అధినేతకు మద్దతుగా టీడీపి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. టీడీపి కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టే క్రమంలో స్వల్ప లాఠీ చార్జ్ కూడా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇల్లు మునగాలనే దురుద్దేశంతోనే వరద నీటిని జగన్ సర్కార్ దిగువకు విడుదల చేయలేదని, కేవలం చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం జగన్ సర్కార్ సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. 

అయితే, జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ.. 5 లక్షల క్యూసెక్కుల వరదకే చంద్రబాబు ఇంటి దగ్గరకి నీళ్లు వచ్చాయని, వరద ఉధృతి పెరిగితే చంద్రబాబు ఉంటున్న నినాసం మునుగుతుందని తాము ఎప్పుడో హెచ్చరించామని అన్నారు. అయినప్పటికీ ఆయనే తమ మాటలను వినిపించుకోలేదని చెబుతూ.. ఇప్పటికైనా తప్పును ఒప్పుకుని చంద్రబాబు తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని అనిల్ కుమార్ హితవు పలికారు. చెప్పిన మాటను వినిపించుకోకపోవడమే కాకుండా తప్పంతా ప్రభుత్వానిదే అని ఆరోపిస్తే ఎలా అని మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నించారు.

ఇక డ్రోన్ విషయానికొస్తే.. వరద ప్రభావిత ప్రాంతాలను సమీక్షించి, వరదను అంచనా వేయడానికి తామే డ్రోన్‌ను పంపామని మంత్రి అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు.

Trending News