తిరుపతిలో సీఎం పర్యటన విశేషాలు

   

Last Updated : Nov 4, 2017, 08:17 PM IST
తిరుపతిలో సీఎం పర్యటన విశేషాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తిరుపతి పర్యటనలో భాగంగా "తనపల్లె" హౌసింగ్‌ కాలనీలో రూ. 52.14 కోట్లతో నిర్మించిన 1704 పక్కా గృహాలను ప్రారంభించారు.

ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే లబ్ది దారులకు గృహ పత్రాలను అందజేశారు.

ఎన్టీఆర్ గృహాల నాణ్యతను దగ్గరుండి పరిశీలించి, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కాలనీ మొత్తం ఎల్ఈడీ దీపాలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు మరియు అధునాతన సౌకర్యాలు ఉండేలా రూపకల్పన చేశామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

అలాగే ఇక్కడి రెండు గృహ సముదాయాలకు అంజనాద్రి, నీలాద్రిగా నామకరణం చేశారు. ఆ ప్రాజెక్టులో భాగంగా జనవరికల్లా రూ.297 కోట్లతో మరో 7416 ఇళ్లను పూర్తి చేసి సంక్రాంతికి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 14 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 5.39 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇటీవలే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మొత్తం రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అలాగే తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ గా చేయడానికి చెరువులను సుందరీకరించనున్నట్లు... నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు తన పర్యటనలో భాగంగా తెలియజేశారు. 

 

Trending News