ఆంధ్రప్రదేశ్: పదో తరగతి పాసైన వెంటనే విద్యార్థులకు పాస్పోర్టు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్మించిన విదేశీ విద్యార్థుల వసతి గృహాన్ని, టెక్నాలజీ భవన్ని శుక్రవారం మంత్రి గంటా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాస్పోర్టు అవసరం, ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతో అందించేందుకు ఆలోచిస్తున్నట్లు గంటా వెల్లడించారు.
దేశంలో మూడో స్థానంలో రాష్ట్ర విద్యావ్యవస్ధ నిలిచిందన్న ఆయన.. పదో తరగతి విద్యార్థులందరికీ పాస్పోర్టు అందించాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు అమరావతిలో వీసా ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టతనిస్తామన్నారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు పెరిగినందుకే గతేడాది 1.81 లక్షల మంది విద్యార్థులు ప్రవేట్ స్కూళ్ల నుండి సర్కారీ బడులకు మారారన్నారు.
ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించామని.. ప్రస్తుతం ఈ భర్తీ విషయం కోర్టు పరిధిలో ఉండటంతో.. కోర్టు క్లియరెన్సు రాగానే ప్రక్రియ వేగవంతం చేస్తామని చెప్పారు.
వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్!
ఏపీలో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి వచ్చే వారంరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు. ఇంటర్వూలు లేకుండా, ప్రతిభ ఆధారంగా పూర్తి పారదర్శకంగా నియామకాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల విద్యాశాఖతో పాటు మున్సిపల్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 9,275 ఉపాధ్యాయ పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉంటాయని వెల్లడించారు. ఈ డీఎస్సీలో ప్రత్యేకంగా సంగీతం, డ్యాన్స్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. డీఎస్సీ విషయంలో పరీక్షలు నిర్వహణ చేపట్టేందుకు ఏపీపీఎస్సీ సుముఖంగా ఉందని.. రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.