ఇటీవలే జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్ వల్లే గెలిచారని ఆయన మాజీ భార్య రెహం ఖాన్ ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సైన్యం ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్కు సహాయం చేసిందని...ఒకవేళ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాదాపు శాఖలన్నీ సైన్యం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. పాకిస్థాన్లోని 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ 115 స్థానాలు గెలుచుకున్నట్లు ఇటీవలే ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ క్రమంలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చిన్న, చితకా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ఎన్నికలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని.. ఈ ఫలితాల్లో రిగ్గింగ్ జరిగిందని.. ఎందరో పెట్టుబడిదారులు కుమ్మకై ఇమ్రాన్ ఖాన్కు మద్దతు పలికారని రెహం ఖాన్ అన్నారు.
బ్రిటీష్ సంతతికి చెందిన రెహమ్ ఖాన్ గతంలో బీబీసికి ప్రెజెంటర్గా కూడా పనిచేశారు. కానీ పెళ్లి చేసుకున్న పది నెలలకే ఈ జంట విడిపోయింది. ఇమ్రాన్ ఖాన్ను తిరుగుబోతుగా, డ్రగ్స్ బానిసగా రెహమ్ ఖాన్ పేర్కొంటూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా ఆమె ఇమ్రాన్ ఖాన్ను నిజాయతీ లేని వ్యక్తిగా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి పాకిస్తాన్ ప్రజలు పట్టం కట్టాలని భావించడం శోచనీయమని ఆమె తెలిపారు. త్వరలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో కీలుబొమ్మగా మారిపోనున్నాడని కూడా రెహమ్ ఖాన్ తెలిపారు.