WHO warning over Omicron spread: గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనిపించట్లేదు. కొత్త సంవత్సరంలోనైనా కరోనా పీడ వదులుతుందనుకుంటే.. వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాల్లో 'థర్డ్ వేవ్' మొదలవగా... దేశంలోనూ ఆ ముప్పు మొదలైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది.
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని లైట్ తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని... ఫలితంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఆసుపత్రులు ఒమిక్రాన్ కేసులతో నిండిపోయాయని తెలిపింది.
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. 'డెల్టాతో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. గతంలో వెలుగుచూసిన వేరియంట్స్ లాగే ఒమిక్రాన్ కారణంగా ఆసుపత్రుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఇది మనుషుల ప్రాణాలను హరిస్తోంది.' అని పేర్కొన్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో హెల్త్ కేర్ సిస్టమ్‌పై ఒత్తిడి పెరుగుతోందన్నారు.
రికార్డు స్థాయిలో కరోనా కేసులు :
గత వారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9.5 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం కంటే 71 శాతం అధికంగా కేసులు నమోదవడం గమనార్హం. నిజానికి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కారణంగా కోవిడ్ టెస్టుల సంఖ్య తగ్గిందని.. సెల్ఫ్ టెస్టుల సంఖ్య నమోదు కాలేదని టెడ్రోస్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఆర్నెళ్లు గడిచే నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.
ఇదే చివరి వేరియంట్ కాదు... : డబ్ల్యూహెచ్ఓ
కరోనా మహమ్మారికి సంబంధించి ఒమిక్రాన్ వేరియంటే (Omicron Variant) చివరిదని చెప్పలేమన్నారు డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ 19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. కొంతమంది వ్యక్తులు మాస్కులు ముఖానికి కాకుండా గడ్డానికి ధరిస్తున్నారని... దానివల్ల ప్రయోజనమేమీ లేదని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకెల్ ర్యాన్ మాట్లాడుతూ... వ్యాక్సిన్ ఈక్విటీ లేనిపక్షంలో 2022 ముగింపులో కూడా మనం కరోనా గురించి చర్చించుకుంటూనే ఉంటామని... అదొక పెద్ద విషాదమని అభిప్రాయపడ్డారు.
Also Read: Seerat Kapoor: అరె పాపం.. శర్వానంద్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి