భారత్‌పై 10 సర్జికల్ దాడులు చేస్తాం: పాకిస్థాన్ హెచ్చరిక

భారత్‌పై 10 సర్జికల్ దాడులు చేస్తాం: పాకిస్థాన్ హెచ్చరిక

Last Updated : Oct 14, 2018, 07:16 PM IST
భారత్‌పై 10 సర్జికల్ దాడులు చేస్తాం: పాకిస్థాన్ హెచ్చరిక

అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్స్ కు సిద్ధమని భారత ఆర్మీ ఇటీవలి ప్రకటనపై పాకిస్థాన్ స్పందించింది. భారత్‌ తమపై ఒక్క సర్జికల్‌ దాడి చేస్తే ప్రతీకారంగా తాము అటువంటి 10 దాడులు చేస్తామని పాకిస్థాన్ శనివారం హెచ్చరించింది  

పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వాతోపాటు సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ లండన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ  హెచ్చరికలు చేశారు.

"పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్‌ చేయాలని భారతదేశం ధైర్యం చేస్తే.. సమాధానంగా 10 దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది." అని గఫూర్ హెచ్చరించినట్లు రేడియో పాకిస్థాన్ పేర్కొంది. అటు పాక్‌కు వ్యతిరేకంగా దాడి చేయాలనుకునేవారు.. తమ సామర్థ్యాలను తక్కువంచనా వేయొద్దన్నారు.

దాదాపు 50 బిలియన్ డాలర్లతో చేపట్టే చైనా పాకిస్థాన్  ఎకనామిక్‌ కారిడార్‌(సీపీఈసీ) భారీ ప్రాజెక్టు సంరక్షణ బాధ్యతను సైన్యం తీసుకుంటుందన్నారు. మెగా ప్రాజెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం బలపడాలని సైన్యం కోరుకుంటోందని వ్యాఖ్యానించినట్లు పాక్‌ రేడియో తెలిపింది. ఇక ఇటీవలి పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అత్యంత పారదర్శకమైన ఎన్నికలుగా గఫూర్ వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ జరిగిందని సాక్ష్యం ఉంటే ఎవరైనా ముందుకు రావచ్చన్నారు.

దేశంలో మీడియాపై ఆంక్షలు విధించారని వస్తున్న వార్తలను అసిఫ్‌ గఫూర్‌ కొట్టిపారేశారు. మీడియాకు తమ దేశంలో పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లో అభివృద్ధి జరుగుతోందని, చెడును వదిలి అంతర్జాతీయ మీడియా మంచి విషయాలను హైలైట్ చేయాలని ఆయన అన్నారు.

Trending News