అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌కు ఝలకిచ్చారు. హార్లీ డేవిడ్‌సన్ బైకులపై భారత పన్ను విధింపును వ్యతిరేకిస్తున్న ట్రంప్.. యూఎస్ఏలో స్టీలు, అల్యూమినియం దిగుమతిపై సుంకం పెంచనున్నారు. భారత్‌తో పాటు చైనాపై కూడా సుంకం పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికా టారీఫ్ కనుగుణంగా నడుచుకోకపోవడంతో ట్రంప్ ఈ పరస్పర పన్నుకు సిద్ధమయ్యారు.
భారత్‌లో విక్రయించే అమెరికా ఆధారిత హార్లీ డేవిడ్‌సన్‌పై విధించే 50 శాతం పన్ను విషయమై ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు. 'భారత్ నుంచి యూఎస్ఏలో దిగుమతి చేసుకునే వాహనాలపై అమెరికా పన్ను విధించడం లేదు. అలాంటిది హార్లీ డేవిడ్‌సన్‌పై భారత్ ఎందుకు 50 శాతం పన్ను విధిస్తున్నదని ప్రశ్నించారు. చైనా 25 శాతం, భారత్ 75 శాతం పన్ను విధిస్తుంటే తాము ఎలాంటి పన్ను విధించడం లేదు. కనుక ఇక మేము పరస్పర పన్ను విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.' అని అన్నారు. కెనడా, మెక్సికో తప్ప అన్ని దేశాలపై స్టీల్‌పై 25 శాతం, అల్యూమీనియంపై 10 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. 'మాపై 50 శాతం పన్ను విధిస్తే.. మేమూ 50 శాతం విధిస్తాం.' అని చెప్పుకొచ్చారు. పరస్పర పన్ను విధానం అమలు ద్వారా.. ఏ దేశం మధ్య వాణిజ్యపరమైన ఇబ్బందులు తలెత్తవని, సజావుగా వ్యాపారం జరుగుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఫలితంగా యూఎస్ఏకు స్టీల్ ఎగుమతి చేస్తున్న భారత్‌తో పాటు చైనా మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. చైనా, యూరప్ ఈ చర్యలకు దిగితే మనకు మరింత ఇబ్బందే. దేశానికి కీలకమైన ఉక్కును విదేశీ పరిశ్రమలు ప్రభావితం చేస్తున్నాయని.. మన ఉక్కును మనమే ఉత్పత్తి చేసుకుందామని ట్రంప్ అన్నారు.