'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ మహమ్మారికి మందు కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం వివిధ దేశాల్లో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.
మరోవైపు 'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా కూడా వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. ఇప్పటికే జంతువులపై తొలి దశలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది. రెండో దశలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం చైనాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ పాకిస్తాన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్..NIHను తమతో కలిసి పని చేయాలని కోరింది. సంయుక్తంగా మరో మూడు నెలల్లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిద్దామని ఆహ్వానించింది.
ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా.. కరోనా వ్యాక్సిన్ .. కోవిడ్ 19 పై విజయం సాధిస్తుందా..? రోగులపై ఇది సక్రమంగా పని చేస్తుందా..? లేదా రోగులకు దీని ద్వారా సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉంటాయా..? అనే విషయాలను చైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ అధ్యయనం చేయనుంది. చైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆహ్వానాన్ని పాకిస్తాన్ NIH అంగీకరించినట్లుగా పాక్ మీడియా తెలిపింది. అంతే కాదు మరో మూడు నెలల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశంలోనూ వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ ఫలితాలనివ్వలేదు. అయినప్పటికీ అన్ని దేశాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐతే చైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ చేస్తున్న ప్రయోగాలపై పాకిస్తాన్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది విజయవంతమైతే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని పాకిస్తాన్ ఆశతో ఎదురు చూస్తోంది.
పాకిస్తాన్ లో కరోనా వైరస్ దారుణంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 11 వేలు దాటింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆ దేశంలో 230 మంది చనిపోయారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
'కరోనా' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్