బంగ్లాదేశ్‌తో భారత్ 4.5 బిలియన్ డాలర్ల డీల్

Last Updated : Oct 4, 2017, 04:02 PM IST
బంగ్లాదేశ్‌తో భారత్ 4.5 బిలియన్ డాలర్ల డీల్

మూడవ లైన్ ఆఫ్ క్రెడిట్‌లో భాగంగా బంగ్లాదేశ్, భారతదేశంతో 4.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సోషల్ సెక్టారు డెవలప్‌మెంట్‌లో భాగంగా జరిగిన ఈ ఒప్పంద  పత్రాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిథి ఏ.ఎం.ఏ.ముహిత్ కూడా సంతకాలు చేశారు. అలాగే బంగ్లాదేశ్ తరఫున ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సెక్రటరీ ఖాజీ షౌఫికల్ ఆజామ్‌ సంతకం చేయగా, భారత్ తరఫున ఎక్స్‌పోర్టు ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరు డేవిడ్ రసిక్విన్హా సంతకాలు చేశారు. ఈ కొత్త లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందాల్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌లో విద్యుత్, రైళ్ళు, రోడ్లు, షిప్పింగ్ మరియు పోర్టుల అభివృద్ధి కోసం ఫండింగ్ ఇవ్వనుంది. అలాగే తీసుకున్న 4.5 బిలియన్ డాలర్లకు గాను బంగ్లాదేశ్ సంవత్సరానికి 1 శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించింది. 20 సంవత్సరాల వ్యవధిలో రుణం తీర్చేందుకు ఒప్పందం కుదరగా, మరో అయిదు సంవత్సరాలు గ్రేస్ టైమ్ కేటాయిస్తూ, భారత్ ఫండింగ్ అందించడం జరిగింది. ఈ బిలియన్ డాలర్ల డీల్, క్రితం ఏప్రిల్ నెలలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ సందర్శించినప్పుడు ప్రకటించడం జరిగింది. 

ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్, భారతదేశానికి చెందిన వస్తు సేవలు వినియోగించుకొనేందుకు 65 నుండి 75 శాతం కొనుగోళ్ళు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య తొలి ఎల్ ఓ సీ 2010లో జరిగింది. అలాగే 2016లో మరో ఒప్పందం జరిగింది. వీటి విలువ 3.06 బిలియన్ డాలర్లు. కానీ గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రభుత్వం కేవలం 576 మిలియన్ డాలర్లను మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. మొదటి ఎల్ ఓ సీలో భాగంగా దాదాపు 862 మిలియన్ డాలర్లు ప్రాజెక్టులు చాలా ఆలస్యంగా ప్రారంభమవ్వగా, రెండవ ఎల్ ఓ సీలో భాగంగా 2 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 

Trending News