అమెరికాలో అకాలీదళ్ లీడర్ పై దాడి

అమెరికాలోని కాలిఫోర్నియాలో అకాలీదళ్ నేత మరియు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ మెంబరు జీకే మంజిత్ సింగ్ పై పలువురు దాడి చేశారు. 

Last Updated : Aug 26, 2018, 07:45 PM IST
అమెరికాలో అకాలీదళ్ లీడర్ పై దాడి

అమెరికాలోని కాలిఫోర్నియాలో అకాలీదళ్ నేత మరియు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ మెంబరు జీకే మంజిత్ సింగ్ పై పలువురు దాడి చేశారు. కాలిఫోర్నియాలో ఓ గురుద్వారాకి వెళ్లి బయటకు వస్తున్నప్పుడు కొందరు ఆయనపై దాడి చేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అలాగే నల్లటి సిరాని ఆయన ముఖానికి పూశారు. బహుశా.. ఖలిస్తాన్ ఉద్యమ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండవచ్చని సమాచారం. ఈ ఘటనలో ఇప్పటికి కాలిఫోర్నియా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

ఈ విషయంపై స్పందించిన జీకే మంజిత్ సింగ్ మాట్లాడుతూ "దాదాపు 20 మంది వ్యక్తులు నాపై దాడి చేయడానికి వచ్చారు. కనీసం గురుద్వారాపై మర్యాద, గౌరవం కూడా లేకుండా వారు అలా ప్రవర్తించారు. నేను నా మనుషులను శాంతియుతంగా ఉండమని కోరుతున్నాను. మేం చట్టరీత్యానే ఈ ఘటనకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటాం" అని మంజిత్ సింగ్ తెలిపారు. గురునానక్ 550వ జన్మదిన మహోత్సవాల్లో భాగంగానే తాను అమెరికాలోని సిక్కు సంఘాలతో మాట్లాడేందుకు వచ్చానని మంజిత్ సింగ్ తెలిపారు.

ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ రాష్ట్రంలో భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న సిక్కు మత ఉద్యమం. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే ఖలిస్తాన్ ఉద్యమకారులు లక్ష్యం. పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్రభూమి అని కూడా అంటారు. తాజాగా అకాలీదళ్ నేత మంజిత్ సింగ్ పై దాడి జరిగాక.. ఆయనపై కూడా పలు కేసులు నమోదు చేశారు అమెరికన్ పోలీసులు. పర్మిషన్ లేకుండా మతపరమైన, రాజకీయ పరమైన సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన వచ్చారని ఆయనపై కేసులు నమోదు చేశారు. 

Trending News