హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం తరువాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. అన్ని రంగాల్లోనూ వరంగల్ శరవేగంగా విస్తరిస్తోంది. రోడ్డు మీద వ్యాపారాలు మొదలు రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ రంగం సైతం వరంగల్‌లో బాగా విస్తరించింది. జనాభా కూడా పెరుగుతోంది. చుట్టు పక్కల జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సైతం బతుకుదెరువు కోసం వలసకూలీలు వరంగల్‌కి వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. అందుకే వరంగల్‌ని కేంద్రంగా చేస్తూ ఓ పోలీసు కమిషనరేట్ కూడా ఏర్పాటైంది.
హైదరాబాద్ స్థాయిలోనే విస్తరిస్తున్న వరంగల్‌లో క్రైమ్ రేటు కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. ఒళ్ళు జలదరించే సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. పదేళ్ల క్రితమే స్వప్నిక అనే అమ్మయిపై యాసిడ్ దాడి జరిగితే.... అప్పటి వరంగల్ ఎస్పీగా ఉన్న వీసి సజ్జనార్ ( ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు) నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అనేక సంచలనాత్మక క్రైమ్ ఘటనలకు వరంగల్ వేదికగా నిలుస్తూ వచ్చింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కుడా పతాక శీర్షికలకెక్కింది. ( నగ్న వీడియోలతో బెదిరింపులు.. వివాహిత ఆత్మహత్య )
ఈ ఘటనలు మరవక ముందే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన 9 మంది హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది శవాలు ఓ పాడుబడ్డ బావిలో దొరికిన ఘటన దేశమంతా కలకలం రేపింది. చనిపోయిన తొమ్మిది మందితో పాటు.. వారిని చంపిన నిందితుడు సైతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతదేహాలు బావిలో దొరకడంతో పోలీసులు ముందుగా ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటారని భావించారు. కానీ ఈ ఘటనలో కీలకంగా పని చేసిన సిసి ఫుటేజ్ ఆత్మహత్య కాదు... హత్య అని తేల్చింది.
సంచలనం సృష్టించిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటనను వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ (24) ఈ దారుణానికి పాల్పడ్డాడని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు.. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను మీడియాకు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. '' గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్, అతడి భార్య పనిచేసేవారు. వెస్ట్ బెంగాల్ నుంచి బతకడానికి ఇక్కడికి వలస వచ్చిన కుటుంబం ఇది. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజయ్ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే తన కుమార్తెతో కూడా నిందితుడు సంజయ్ చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి అతన్ని నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. ( Read also : 9 నెలల చిన్నారిని హత్య చేసి, దంపతుల ఆత్మహత్య )
పెళ్లి కోసం పెద్దల దగ్గరికని చెప్పి ----
పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజయ్ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్ రథ్ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమెతో తాగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తరువాత ఆమె చున్నీతోనే గొంతు నులిమేశాడు. చనిపోయిందని భావించిన సంజయ్ రైలు నుంచి ఆమెను తోసేశాడు. నిడదవోలు రైల్వే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. రాజమండ్రిలో దిగిపోయిన సంజయ్.. ఏమీ తెలియనట్టే తిరిగి వరంగల్ చేరుకున్నాడు. కొద్దీ రోజులుగా రఫికా కనిపించకపోవడంతో తన అక్క కూతురు గురించి మక్సూద్ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో తన నేరం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన సంజయ్.. రఫికా హత్యను రహస్యంగానే ఉంచేందుకని మక్సూద్ కుటుంబాన్ని కూడా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఐదు రోజులు రెక్కీ.. ఆపై హత్యలు
ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. ఈ నెల 20వ తేదీన మక్సూద్ మొదటి కుమారుడైన షాబాజ్ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్ చౌరస్తాలో ఓ మెడికల్ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోనె సంచుల్లో వేసి గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లిపోయాడు. అలా రఫిక హత్యను కప్పిపుచ్చుకోడానికి తొమ్మిది హత్యలు చేసి పోలీసులకు దొరికిపోయాడు. ( Read also :
పట్టించిన సీసీ కెమెరాలు:
'' మొత్తం ఈ కేసు ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటిని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేశాం. ఇంట్లోంచి వెళ్లడం దగ్గర నుంచి మళ్లీ చేరుకునే వరకు అందులో నమోదయ్యాయి. ఆ తర్వాతే నిందితుడిని జాన్‌పాకలోని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నామని.. కస్టడీలోకి తీసుకున్న అనంతరం అతడి నుంచి మరిన్ని వివరాలు రాబడతాం’’ అని వరంగల్ సీపీ రవీందర్ వెల్లడించారు. సీసీఎస్, టాస్క్ ఫోర్స్, టెక్నికల్ ఇతర బృందాలు 72 గంటల్లో కేసును ఛేదించాయి. ఇవి వలసకూలీల ఆత్మహత్యలు కావు.. కిరాతక హత్యలు అని హత్యలు జరిగిన స్వల్ప వ్యవధిలోనే నిగ్గు తేల్చిన వరంగల్ పోలీసులను అభినందించి తీరాల్సిందే.
ఏదేమైనప్పటికీ వరంగల్‌లో ఏం జరిగినా అది పెను సంచలనమే అవుతోంది. క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేకపోలేదు అని జనం అనుకుంటున్నారు.
వరంగల్ మర్డర్స్ మిస్టరీలో ట్విస్టులెన్నో .. 9 హత్యలకు దారితీసిన ఒక వివాహేతర సంబంధం !