ఆరోపణలు నిరూపిస్తే ఉరేసుకుంటా:ఎంపీ బాల్కసుమన్‌

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ స్పందించారు.

Last Updated : Jul 7, 2018, 06:24 PM IST
ఆరోపణలు నిరూపిస్తే ఉరేసుకుంటా:ఎంపీ బాల్కసుమన్‌

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరివేసుకుంటా అని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దమన్న ఆయన.. కుటుంబంతో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేశారని తెలిపారు. మంచిర్యాలకు చెందిన అక్కాచెల్లెళ్లు సంధ్య, బోయిని విజేత బ్లాక్ మెయిలింగ్ చేయడంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు.

సంధ్య, బోయిని విజేత కొంతకాలంగా ఎంపీ సుమన్‌కు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఇబ్బంది పెడుతుండగా.. సుమన్‌ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేశారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా వారిలో మార్పు రాలేదు. తనను పెళ్లి చేసుకున్నారని అసత్య ప్రచారం ప్రారంభించారు. పైగా ఎంపీ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశారు.

ఎంపీ పీఏ ఫిర్యాదు మేరకు జూన్‌లో కేసు నమోదు చేసినా.. పద్ధతి మార్చుకోని వీరిద్దరు.. ఫేస్‌బుక్‌లో సుమన్‌ తన కుటుంబంతో దిగిన ఫొటోను మార్ఫింగ్‌ చేసి, ఆయన భార్య స్థానంలో సంధ్య తన ఫొటోను పెట్టి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘బాల్కసుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసులు’ అంటూ ప్రచారం జరిగింది. అటు ఎంపీ సుమన్‌ మహిళలను లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తెలిపారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్‌ మీడియాల్లో పెట్టి ప్రచారం చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Trending News