హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కి దారితీసే రహదారులు, ట్యాంక్ బండ్ కి ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ ఉద్రిక్తంగా మారాయి. ప్రతిపక్షాల మద్దతుతో టిఎస్ఆర్టీసీ చేపట్టిన ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికులు, వారి మద్దతుదారులు ట్యాంక్ బండ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకుంటున్న పోలీసులను తోసుకుని ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరం నలమూలల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఛలో ట్యాంక్ బండ్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు 300 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు ఉన్నారు.