హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనపై జేఏసీ కన్వినర్ అశ్వథామ రెడ్డి స్పందించారు. అశ్వత్థామ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను కాపాడటమే తమ ముందున్న ప్రధాన ధ్యేయమని, అంతేకానీ తమకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని అశ్వత్థామ రెడ్డి తేల్చిచెప్పారు. అయితే, అదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు కూడా తలొగ్గేది లేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా సమ్మె కాలంలో ఎంతో మంది ప్రైవేట్ వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే మిగులు బడ్జెట్ ఉందని సర్కార్ చెప్పడం విడ్డూరంగా ఉందని అశ్వత్థామ రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీలో 2600 పైచిలుకు బస్సులు ఓవర్ మైలేజీ అయ్యాయని చెప్పిన అశ్వత్థామ రెడ్డి.. కొత్త బస్సుల కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కొండగట్టు వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని... చట్టపరంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.