Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy Letter to Minister KTR: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోయిందంటూ ఫైర్ అయ్యారు. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2023, 01:45 PM IST
Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy Letter to Minister KTR: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైందన్నారు. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయని.. బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులు, సహయ చర్యల గురించి మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. మంత్రి పదవిలో ఉన్న కేటీఆర్.. ప్రజలను గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. పుట్టినరోజులు చేసుకుంటూ ప్రజలను మీ చావు మీరు చావండి అని వారి మానానికి వారిని వదిలేసి అని నిసిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఫామ్ హౌస్‌లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేదతీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రీకొడుకులు పోటీ పడుతుంటారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్‌కు కల్పించారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇవన్నీ చూస్తుంటే మీ అసమర్థత కారణంగా హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.

హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రీకొడుకులు  హైదరాబాద్ నగరాన్ని నరక కూపంగా మార్చారు. గత 9 ఏళ్లుగా నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే దిశగా ఒక్క చర్య చేపట్టలేదు. మీరు ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్ని జరిగితే ఐటీ కారిడార్ నుంచి హయత్ నగర్ వరకు ట్రాఫిక్ జామ్‌లు ఎందుకు నిత్యకృత్యంగా మారుతాయి.
ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. రహదారుల నిర్వహణ మీకు అప్రాధాన్యత అంశంగా మారింది. ఫ్లైఓవర్ల కింద అండర్ పాస్ లు నీళ్ళు నిండిపోయి వాహనాలు వెళ్ళలేక జనాలు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని కాలనీల్లో ఫీట్ మేర గుంతలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే స్ట్రాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా ఉత్తి డొల్ల అని తేలిపోయింది.." అని రేవంత్ రెడ్డి అన్నారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభావిత ప్రజలకు రూ.10 వేల సాయం ప్రకటించాలన్నారు. వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదిన మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ఇప్పటికైనా కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలన్నారు. లేకపోతే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపం ర్యాలీగా వెళ్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చేతగాని తనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.  

Also Read: Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్‌ కాల్‌తో..!  

Also Read: IND vs WI 1st ODI: విండీస్ తో తొలి వన్డే నేడే.. తుది జట్టులో ఉండేది ఎవరు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News