న్యూ ఢిల్లీ : సీఏఏ, ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్పై తమ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వివరించినట్టుగా దేశంలోని ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదని వ్యాఖ్యానించారు.
ఈ మూడు ప్రక్రియలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేకే అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని, రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తే కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి లోబడి వెనక్కి తగ్గాల్సిందేనని ఆయనన్నారు. పార్లమెంట్ పాస్ చేసిన బిల్లుపై ప్రజలు రోడ్లమీదకొచ్చారని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యతిరేకించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి పునరాలోచించాలని హితవు పలికారు.
సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై పార్లమెంటులో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తాము వ్యతిరేకించామని గుర్తుచేస్తూ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై కూడా గందరగోళం నెలకొందని కేకే అన్నారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికలోనే పేర్కొందని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఈ అంశాలపై ఒక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.
కేంద్రం రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటిగా లాగేసుకుంటోందని ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు విభజన హామీలపై చర్చించేందుకు పార్లమెంటులో పూర్తిగా ఒక రోజు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేశవరావుతో పాటు అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఏఏ పై ఈ పరిస్థితిని తమ ముఖ్యమంత్ర ముందే ఊహించి వ్యతిరేకించారని, తాము సభలో వ్యతిరేకంగా ఓటు వేశామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్లు గడచిపోయాయని, ఇప్పటికీ అనేక విభజన హామీలు పెండింగ్ ఉన్నాయని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..