హైదరాబాద్: రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం అధికారులు వెల్లడించారు. దిగువనే వున్న తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేం ద్రం అధికారులు తెలిపారు. అయితే, ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణపై అంతగా ఉండబోదని అధికారులు స్పష్టంచేశారు.
ఇప్పటికీ తెలంగాణలో అనేక ప్రాంతాలను వర్షాభావ పరిస్థితులు వేధిస్తున్నాయి. ఆలస్యంగా కురిసిన తొలకరిని నమ్ముకుని సాగు మొదలుపెట్టిన రైతులు వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో దిగాలుపడుతున్నారు. వేసిన విత్తనాలు సైతం ఎండిపోగా పలుచోట్ల మొలకెత్తిన మొలకలు కూడా వాడిపోయాయి.
ఇదిలావుంటే, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, అసోం, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేకచోట్ల ఇళ్లు నేలకూలగా భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది.