తమిళనాడులో శరత్ కుమార్ అనే ఫారెస్టు గార్డు గుంతలో పడిపోయి చావుబతుకుల మధ్యనున్న ఓ చిన్న ఏనుగుపిల్లను కాపాడాడు. తానే స్వయంగా దాని దగ్గరకు వెళ్లి భుజాన వేసుకొని స్థానిక పశువుల ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే ఆ సంఘటన జరగకముందే.. ఆ ఏనుగుపిల్ల తల్లి రోడ్డు మీదకు వచ్చి వాహనాలను ఆపేయడం గమనార్హం.
పరిస్థితి ఏంటో తెలుసుకుందామని ఫారెస్టు అధికారులు ఆ ఏనుగును తరమగా.. అది వారిని గుంత వద్దకు తీసుకెళ్లింది. ఆ గుంతలో పడిపోయిన పిల్ల ఏనుగును చూసి అధికారులు వెంటనే గార్డులకు కబురుపెట్టారు. ఆ గార్డుల్లో ఒకరైన శరత్ ధైర్యంగా ముందుకు వచ్చి దానిని కాపాడాడు. ఈ ఫోటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దానిని చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. 'ఇతనే అసలైన బాహుబలి' అని పేర్కొంటూ ఆ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
అతనే రియల్ 'బాహుబలి'..!