తెలంగాణ కచ్చితంగా సిరిగల్ల రాష్ట్రమే : సీఎం కేసీఆర్

తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టంచేశారు. 

Last Updated : Mar 23, 2018, 03:13 PM IST
తెలంగాణ కచ్చితంగా సిరిగల్ల రాష్ట్రమే : సీఎం కేసీఆర్

తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం అభివృద్ధిని సాధించామని, కేంద్ర బడ్జెట్, కేంద్ర డీజీపీ 49%తో పోల్చితే తెలంగాణ ఎంతో ముందు ఉంది అన్నారు కేసీఆర్. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ జరిగిన సందర్భంలో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతీసారి బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఏదో విమర్శించాలి కనుక విమర్శిద్దాం అన్నట్టు కాకుండా ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకునే మాట్లాడితే బాగుంటుందని ప్రతిపక్ష సభ్యులకు సీఎం కేసీఆర్ హితవు పలికారు. బడ్జెట్ చప్పగా ఉంది. అంకెల గారడీ అని విమర్శించడం సరికాదు అని ప్రతిపక్ష సభ్యులపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. 

బడ్జెట్ కన్నా అధిక మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని మాట్లాడటం హాస్యాస్పదం. ఎందుకంటే భారత్ కన్నా అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్న అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో సైతం ఆయా దేశాల బడ్జెట్ కన్నా.. వారి అప్పులు ఎంతో అధికం. అంత మాత్రానికే అవి అభివృద్ధి చెందిన దేశాలు కాకపోతాయా అధ్యక్షా అని వివరణ ఇస్తూ ప్రతిపక్షాలపై తన అసహనాన్ని వెళ్లగక్కారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 మధ్యకాలంలో 23 జిల్లాలకు ఖర్చు పెట్టింది రూ. ఒక లక్ష 29 వేల కోట్లు మాత్రమే. ఈ నాలుగేళ్లలో తెలంగాణలో ఖర్చు పెట్టింది రూ. ఒక లక్షా 24 వేల కోట్లు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటదని ఉద్యమ సమయంలో చెప్పాం. అదే అమలు చేసి చూపిస్తున్నాం అని చెప్పిన సీఎం కేసీఆర్... ఈ సంవత్సరం దేశంలో ఏ రాష్ర్టానికి రానన్ని అవార్డులు తెలంగాణకు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Trending News