హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కేబినెట్ ఏర్పాటును మాత్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా తనతోపాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీకి కేసీఆర్ ఈసారి కేబినెట్లో హోంశాఖను కేటాయించారు. గతంలో హోంశాఖ మంత్రిగా నాయని నర్సింహా రెడ్డి ఉండగా ఈసారి ఆ స్థానంలోకి మొహమూద్ అలీ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెన్నంటే వున్న మహ్మూద్ అలీకి కేబినెట్లో కీలక హోదానే దక్కింది. గతంలో ఉప ముఖ్యమంత్రులుగా మొహమూద్ అలీతోపాటు కడియం శ్రీహరి కూడా ఉన్నారు. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటే కీలకమైన విద్యాశాఖ పోర్ట్‌ఫోలియోను సైతం నిర్వహించారు. ఈసారి కూడా కడియం శ్రీహరికి కీలకమైన హోదానే దక్కుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.