Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయం నుంచి ఈ ప్రచారం సాగుతుండగా.. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడే ప్రభుత్వం మార్పుపై బాంబ్ పేల్చడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రి సీటుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఓ ఉమ్మడి జిల్లా నాయకులంతా ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఆసక్తికర చర్చకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరలేపారు.
Also Read: KTR vs Kharge: పాలమూరు కూల్చివేతలపై ఖర్గేకు కేటీఆర్ ఫిర్యాదు.. మీ ప్రభుత్వానికి కనికరం లేదా?
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో శుక్రవారం భువనగిరిలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. సభలో రాజగోపాల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి అని సంభోదించడం కలకలం రేపింది. అనంతరం రాజగోపాల్ ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. 'నా నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయి. నేను ఏమి అంటే అది జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారు' అని రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?
భువనగిరి సమావేశంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. రేవంత్ రెడ్డి స్థానంపై నల్లగొండ నాయకులు కన్నేశారని అర్థమవుతోంది. గతంలోనే ముఖ్యమంత్రి స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీపడిన విషయం తెలిసిందే. కాకపోతే ఆ సమయంలో అవకాశం లభించలేదు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికై కొన్ని నెలల్లో ఏడాది ముగియనుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఏడాది తర్వాత ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి ఉంది. దీంతో నల్లగొండ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రేవంత్ పై వ్యతిరేకత?
పాలనలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమవుతుండడంతో పార్టీకి చెడ్డ పేరు లభిస్తోందనే చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా రేవంత్ పాలనపై సదాభిప్రాయం లేదు. అతడిని కొనసాగిస్తే భవిష్యత్‌లో చాలా ప్రమాదం పొంచి ఉందనే భయాందోళన పార్టీ నాయకుల్లో ఏర్పడింది. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ, పాలనపై రేవంత్ తన ముద్ర వేయకపోవడంతో అతడిని దించేయాలనే డిమాండ్ పెరుగుతోంది. రేవంత్ రెడ్డిని దించేసి సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించుకున ఆలోచనలు నల్లగొండ నాయకులు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందులో భాగమే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తోంది.
మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే?
అంతేకాకుండా తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. హోంమంత్రిగా అవకాశం కల్పించాలని చాలా బహిరంగ సభల్లో తెలిపారు. అయితే అతడిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రేవంత్ సిద్ధంగా లేరని కనిపిస్తోంది. తన వినతిని పట్టించుకోని నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏకంగా రేవంత్‌నే దించేయాలనే మాస్టర్ ప్లాన్ వేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. తమ జిల్లావాసి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తనకు మంత్రి పదవి అవకాశం లభిస్తుందనే ఆశాభావంలో రాజగోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో భారీ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Komatireddy vs Revanth: రేవంత్ రెడ్డికే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్.. త్వరలో సీఎం మార్పు?